ఇండియన్ కబడ్డీ క్రీడాకారిణి ప్రీతి ఆత్మహత్య కేసులో ఆమె భర్త రాకేష్ కృష్ణకు 9ఏళ్ళ జైలు శిక్ష విధించింది కాసర్గాడ్ కోర్టు. ఈ కేసులో రాకేష్ తో పాటు అతని తల్లి శ్రీలతను కూడా దోషిగా తేల్చిన కోర్టు 7ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2017లో సంచలనం రేపిన ప్రీతి ఆత్మహత్య కేసులో బుధవారం ( సెప్టెంబర్ 18, 2024 ) తీర్పు వెల్లడించింది కోర్టు. పీఈటీ టీచర్, కబడ్డీ ప్లేయర్ అయిన ప్రీతి అత్తింటి వేధింపులు తాళలేక రెండేళ్ల కూతురును వదిలేసి పుట్టింట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రీతి ఆత్మహత్యకు భర్త రాకేష్, అత్త శ్రీలతల వేధింపులే కారణమని తేల్చింది కోర్టు. ఐపిసి సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) మరియు సెక్షన్ 498 ఎ కింద రాకేష్, శ్రీలతలను దోషులుగా నిర్ధారించింది న్యాస్థానం. రాకేష్ కు 9ఏళ్ళు, శ్రీలతకు 7ఏళ్ళు జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది కోర్టు. జరిమానా చెల్లించకపోతే మరో ఎనిమిది నెలలు శిక్ష పొడిగించాలని తెలిపింది కోర్టు.