రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుడు మృతి

న్యూఢిల్లీ: రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున ఫైట్ చేస్తున్న కేరళకు చెందిన టీబీ బినిల్ (32) అనే యువకుడు మరణించారు. అతడి సమీప బంధువు టీకే జైన్ (27) సైతం డ్రోన్ బాంబు దాడిలో గాయపడ్డారు. అయితే, బినిల్ బాబు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

“రష్యా తరఫున  యుద్ధం చేస్తున్న కేరళవాసి దురదృష్టవశాత్తు మరణించినట్టు మాకు తెలిసింది. కేరళకు చెందిన మరో సైనికుడు కూడా మాస్కోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని భారత్ కి రప్పించేందుకు కృషి చేస్తున్నాం. రష్యన్ అధికారులతో ఇప్పటికే  సంప్రదింపులు మొదలుపెట్టాం. మిగిలిన పౌరులను కూడా వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు.