న్యూఢిల్లీ: ఇండియన్ స్టాక్ మార్కెట్లు గత ఐదేళ్లలో ఏడాదికి సగటున 15 శాతం రిటర్న్ ఇచ్చాయని సెబీ హోల్‌టైమ్ మెంబర్ అనంత్ నారాయణ్ ఇన్వెస్టర్లకు గుర్తు చేశారు. అదే చైనీస్ మార్కెట్ అయితే జీరో రిటర్న్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. తక్కువ రిస్క్‌తో ఇండియా మార్కెట్‌లో ఎక్కువ లాభాలు సంపాదించొచ్చన్న ఆయన, ఇన్వెస్టర్లు జాగ్రత్త పడడం మర్చిపోవద్దని సలహా ఇచ్చారు. ‘గత కొన్ని రోజులుగా చైనా మార్కెట్ల గురించి బాగా మాట్లాడుతున్నారు. కానీ, గత ఐదేళ్లు చూసుకుంటే ఇండియా మార్కెట్లు ఏడాదికి సగటున 15 శాతం రిటర్న్ ఇచ్చాయి.
చైనీస్ మార్కెట్లు దీనికి దరిదాపుల్లో కూడా లేవు. అసలు లాభాలే లేవు. హాంకాంగ్ మార్కెట్ అయితే నష్టాలిచ్చింది’ అని నారాయణ్ వివరించారు. 2023–24 మార్కెట్లకు కలిసొచ్చిన ఆర్థిక సంవత్సరమని, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు 28 శాతం పెరిగాయని గుర్తు చేశారు. వోలటాలిటీ కేవలం 10 శాతం దగ్గరే ఉందని అన్నారు. దీనర్ధం తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభాలు సంపాదించడమేనని అభిప్రాయపడ్డారు. డెరివేటివ్స్ వంటి స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు సెబీ వ్యతిరేకం కాదన్న నారాయణ్, షార్ట్ టెర్మ్ ట్రేడ్ చేసే ఇన్వెస్టర్లు రిస్క్‌లను అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు.