ఏ సామాజిక వ్యవస్థాపనలోనైనా వివాహ వ్యవస్థ ముఖ్యమైనది. ఇది కొన్ని క్రమబద్దమైన ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉంటుంది. భారతీయ సమాజంలో వివాహేతర లైంగిక సంబంధం నిషేధం. అంతేగాకుండా వివాహానికి సంబంధించి విభిన్న సమాజాల్లో వివిధ వివాహ నిబంధనలు, వివాహ పద్ధతులు ఉన్నాయి.
అంతర్వివాహం : ఒక సమూహానికి చెందిన వ్యక్తి భార్యను గాని లేదా భర్తను గాని తమ సమూహం నుంచి మాత్రమే వివాహం చేసుకునే పద్ధతిని అంతర్వివాహం అంటారు. వివాహ సంబంధాలు ఆ సమూహానికి మాత్రమే పరిమితమై ఉంటే అది అంతర్వివాహ సమూహంగా వ్యవహరించబడుతుంది. ఉదాహరణకు హిందూ సమాజంలో కులం అంతర్వివాహ సమూహం. హిందూ సమాజంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ కులస్తులనే వివాహం చేసుకోవాలి. వారివారి కులాల పరిధులను దాటిపోకూడదు.
బహిర్వివాహం : ఒక సమూహానికి చెందిన స్త్రీ లేదా పురుషుడు తన భార్యను గాని లేదా భర్తను గాని అదే సమూహం నుంచి కాకుండా మరో సమూహం నుంచి వివాహం చేసుకునే పద్ధతిని బహిర్వివాహం అంటారు. ఉదాహరణకు హిందూ సమాజంలో ఎవరూ సగోత్రులను వివాహం చేసుకోకూడదు. వేరొక గోత్రంలోని వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. కాబట్టి హిందూ సమాజంలో గోత్రం విషయంలో బహిర్వివాహం, కులం విషయంలో అంతర్వివాహం ఆచరణలో ఉన్నాయని చెప్పవచ్చు.
వివాహం రకాలు
ఏక వివాహం : ఏక వివాహ పద్ధతి అంటే ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహమాడటం. దేశంలో అధిక సంఖ్యాకులు పూర్వకాలం నుంచి ఏకవివాహ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఏక వివాహం నిజానికి అన్ని వివాహాల్లోకి చాలా ఉత్తమమైనదిగా పేర్కొనవచ్చు. నేటి ఆధునిక సాంఘిక, ఆర్థిక వ్యవస్థల్లో ఏక వివాహం పటిష్టమైనదిగాను లాభదాయకమైనదిగాను సర్వజనామోదమైనదిగాను తలచి ప్రపంచ దేశాలన్నీ అనుసరిస్తున్నాయి.
బహు భార్యత్వం : బహుభార్యత్వం అంటే ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహమాడే పద్ధతి అని చెప్పవచ్చు. వేదకాలం నుంచి ఆధునిక కాలం వరకు బహుభార్యత్వ పద్ధతిని రాజ్యాధినేతలు, ధనవంతులు తదితరులు అనుసరించారు. అంతేగాక ఈ వివాహ పద్ధతి మనదేశంలో నివసిస్తున్న ఆదిమ తెగల్లోను ముస్లింల్లోను హెచ్చుగా కనిపిస్తుంది. మన దేశంలోని ఆదిమ తెగలైన నాగాలు, గోండులు, బైగాలు బహుభార్యత్వాన్ని పాటిస్తున్నారు.
ఈ బహుభార్యత్వాన్ని పాటించడానికి సమాజ శాస్త్రవేత్తలు అనేక కారణాలు చెబుతున్నారు. సమాజంలో స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య కంటే హెచ్చుగా ఉండటం, ఎక్కువ మంది భార్యలు ఉండటాన్ని ఒక హోదాగా పరిగణించడం, ఆస్తిపాస్తులను కాపాడుకోవడం కోసం వారసుల నిమిత్తం అనేక మంది భార్యలను చేసుకోవడం, పురుషునికి అనేక మంది స్త్రీలపై లైంగికాసక్తి, స్త్రీ ఆర్థికాభివృద్ధికి సహాయకారిగా ఉండటం మొదలైన వాటిని ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు.
మన దేశంలో 1955లో భారత ప్రభుత్వం హిందూ వివాహ చట్టాన్ని అమలు పరచి బహుభార్యత్వాన్ని నిషేధించారు. కానీ ఈ చట్టం మహమ్మదీయ మతస్తులకు వర్తించదు. బహుభార్యత్వం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవడం వల్ల దీనిని ఆధునిక కాలంలో ఎక్కువ శాతం ప్రజలు ఆమోదించడం లేదు.
బహు భర్తృత్వం : ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులను వివాహమాడే పద్ధతిని బహు భర్తృత్వం అంటారు. బహు భర్తృత్వ పద్ధతి ఆదిమ తెగల్లో కనబడుతుందే తప్ప ఆధునిక నాగరిక సమాజాల్లో కనిపించదు. బహుభర్తృత్వం రెండు రకాలు. అవి.. సోదర బహు భర్తృత్వం, సోదరేతర బహు భర్తృత్వం. ఒక స్త్రీని సోదరులందరూ వివాహం చేసుకొన్నట్లయితే దానిని సోదర బహుభర్తృత్వం, ఒక స్త్రీ భర్తలందరూ సోదరులు కానట్లయితే దానిని సోదరేతర బహు భర్తృత్వం అంటారు.
ఉదాహరణకు దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో నివసించే తోడాలు, ఉత్తరప్రదేశ్ లో నివసిస్తున్న ఖాసాలు వంటి ఆదిమ తెగల వారు బహు భర్తృత్వ వివాహ పద్ధతిని పాటిస్తున్నారు. బహు భర్తృత్వానికి ప్రధాన కారణాలు పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్య కంటే ఎక్కువగా ఉండటమే.
అధిగణన వివాహాలు : అధిగణన వివాహాలు హిందూ సమాజంలోను అనేక ఇతర సమాజాల్లోను ఆచరణలో ఉన్నాయి. మేనబిడ్డల వివాహం లేదా మేనరిక వివాహం, మేనమామ - మేనకోడలు వివాహం, సమాంతర పిత్రీయ సంతతి వివాహమనేవి అధిగణన వివాహాలకు ఉదాహరణలు. ఒక వ్యక్తి తన తల్లి సోదరుని కుమార్తెను గాని, లేదా తన తండ్రి సోదరి కుమార్తెను గాని వివాహం చేసుకునే ఆచారాన్ని మేనబిడ్డల వివాహం అంటారు.
మేనబిడ్డల వివాహం ద్వారా అంతకుముందే బంధుత్వం కలిగి ఉన్న రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయి. మేనమామ - మేనకోడలు వివాహం ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఆచరణలో ఉంది. కొన్ని అరబ్ దేశాల్లోను భారతదేశంలోని కొంతమంది ముస్లింల్లోను సమాంతర పిత్రీయ సంతతి వివాహం ఆచరణలో ఉంది.
హిందూ సమాజంలో వివాహం
హిందూ సంస్కారాల్లో వివాహంలో భాగస్వాములైన భార్యభర్తలిద్దరు కలిసి ధర్మబద్ధంగా జీవించడానికి వివాహం చాలా అవసరమని భావిస్తారు. హిందువుల్లో వివిధ రకాలైన వివాహాలున్నాయి.
ప్రశస్థ వివాహాలు
బ్రహ్మము : విద్య, సదాచారం ఉన్న యువకుని కన్యాదాత స్వయంగా పిలిచి వస్త్రాలంకారాదులతో కన్యనిచ్చి చేసే వివాహం.
దైవం : జ్యోతిష్టోమాది యజ్ఞాల్లో ఆయా కర్మలను యథావిధిగా నడిపిన రుత్విజుని అలంకరించి కన్యనిచ్చి చేసే వివాహం.
ఆర్షం : కన్యాదాత ధర్మార్థం వరుని దగ్గర నుంచి ఒక జత గోవులను తీసుకొని కన్యనిచ్చి యథాశాస్త్రీయంగా చేసే వివాహం.
ప్రాజాపత్యం : మీరుభయులూ ధర్మం చేయండి. ధర్మబద్ధంగా జీవించండని కన్యాదాత వరునితో చెప్పి కన్యనిచ్చి చేసే వివాహం.
అప్రశస్థ వివాహాలు
అసురం : కన్యాదాతకు ధనమిచ్చి కన్యను తీసుకొనిపోయి చేసుకునే వివాహం.
గాంధర్వం : వధూవరులిద్దరూ ఇష్టపడి, పెద్దల ప్రమేయం లేకుండానే చేసుకునే వివాహం.
రాక్షసం : కన్యను బలాత్కారంగా తీసుకొనిపోయి చేసుకునే వివాహం.
పైశాచం : నిద్రావస్థలోగాని, అపస్మారకంలోగాని ఉన్న కన్యను బలవంతంగా తీసుకొని వెళ్లి చేసుకొనే వివాహం.