70 ఏళ్లుగా ఎవరికి సాధ్యంకాని చిక్కుముడి విప్పింది

లెక్కలంటేనే చిక్కుముడులున్న ప్రశ్నలు. వాటిలో అంతుచిక్కని ప్రశ్నలు లెక్కలేనన్ని ఉంటాయి. అలాంటి ప్రశ్నకు సమాధానం కనిపెట్టింది ప్రొఫెసర్ నీనా గుప్తా. డెబ్బయ్యేండ్లుగా ఎవరి వల్ల సాధ్యంకాని చిక్కుముడి విప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకుగాను ఆమెకు ఈ ఏడాది మ్యాథమెటిక్స్​లో అత్యున్నతమైన ‘రామానుజన్​ అవార్డు’ వచ్చింది. ఈ అవార్డు అందుకున్న మూడో మహిళ నీనా.

కోల్​కతాలోని ఇండియన్​ స్టాటిస్టికల్​ ఇనిస్టిట్యూట్​లో ప్రొఫెసర్​గా పనిచేస్తోంది నీనాగుప్తా. ఆమె ఇదే కాలేజీలో మ్యాథ్స్​లో పీజీ చేసింది. తర్వాత ఆల్​జిబ్రాయిక్​ జియోమెట్రీలో పీహెచ్​డీ చేసి, ప్రొఫెసర్​గా చేరింది. అంతుచిక్కని ప్రశ్నలకి సమాధాలు వెతకడాన్ని ఛాలెంజ్​గా తీసుకునేది నీనా. 2014లోఆల్​జిబ్రాయిక్​ జియోమెట్రీలో ‘జరస్కీ క్యాన్సిలేషన్ కంజెక్చర్’ అనే చిక్కుప్రశ్నకి సమాధానం కనుగొన్నది. దాంతో ఆ ఏడాది తనకు ఇండియన్​ నేషనల్​ సైన్స్​ అకాడమీ యంగ్​ సైంటిస్ట్ విభాగంలో మెడల్​ ఇచ్చారు. మ్యాథ్స్​లోని మొండి ప్రశ్నకి సొల్యూషన్​ చెప్పినందుకు ఇప్పుడు నీనాకు  ప్రెస్టీజియస్​ రామానుజన్​ అవార్డు వచ్చింది. ఈ అవార్డు సాధించిన నాలుగో ఇండియన్ తనే​. అంత పెద్ద అవార్డు వచ్చింనందుకు ఆనంద పడుతూనే, కమ్యుటేటివ్​ ఆల్​జీబ్రా విభాగంలోని ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో ఉంది ఈ మ్యాథమెటీషియన్​. 

పీహెచ్​డీ రోజుల నుంచే
‘‘చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్​ నా ఫేవరెట్​ సబ్జెక్ట్​. అయితే, డిగ్రీ చదివిన తర్వాత నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు మావాళ్లు. కానీ, లెక్కల మీద నాకున్న ఇంట్రెస్ట్​ చూసి ఇంట్లో పెళ్లి ఊసెత్తలేదు. జరస్కీ క్యాన్సిలేషన్​ కంజెక్చర్​ ప్రాబ్లమ్​ నాకు పీహెచ్​డీ రోజుల నుంచే తెలుసు. అయితే, నేనే ఈ చిక్కుప్రశ్నకి సమాధానం కనుక్కుంటానని అనుకోలేదు. రామానుజన్​ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అయితే,  మ్యాథమెటిక్స్​లో సొల్యూషన్​ చూపించాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి” అంటోంది నీనా గుప్త.