- ఇద్దరు మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు
- విద్యార్థులంతా మహారాష్ట్ర వాళ్లే..
మాస్కో: మనదేశానికి చెందిన నలుగురు మెడికల్ స్టూడెంట్లు రష్యాలోని ఓ నదిలో గల్లంతయ్యారు. మొదట ఒక విద్యార్థి నదిలో పడటంతో కాపాడేందుకు ప్రయత్నిం చిన మిగతా ముగ్గురూ నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. రెస్క్యూ టీమ్స్ ఇద్దరి డెడ్‌బాడీలను వెలికితీయగా మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, అందరూ మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాకు చెందినవారు.
ఒకరిని కాపాడిన స్థానికులు
రష్యాలో పురాతన నగరమైన నోవోగరోడ్లోని యూనివర్సిటీలో జీషన్ పింజారీ, జియా పింజారీ, హర్షల్ అనంత్‌రావ్, మాలిక్ మహమ్మద్ యాకూబ్, నిషా సోనావానే మెడిసిన్ చదువుతున్నారు. శుక్రవారం ఖాళీ సమయంలో సిటీకి ఆనుకుని ఉన్న నదీ తీరానికి వాకింగ్ వెళ్లారు. నడుస్తుండగా అందులో ఒకమ్మాయి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు మిగతా నలుగురూ నీళ్లలోకి దిగారు.
ప్రవాహ తీవ్రతకు నలుగురూ కొట్టుకుపోయారు. వీరిలో నిషా అనే అమ్మాయిని స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందడంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ స్పాట్‌కు చేరుకుని ఇద్దరి డెడ్‌బాడీలను వెలికితీశారు. మిగతా ఇద్దరు బతికే అవకాశంలేదని, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నామని తెలిపారు. మృతులంతా 18 నుంచి 20 ఏండ్ల మధ్య వయసువారేనని గుర్తించారు.
ప్రమాద సమయంలో ఒడ్డున ఉన్న వ్యక్తి తన ఇంట్లో వాళ్లతో వీడియో కాల్లో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటనపై సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని, డెడ్‌బాడీలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.