ఒలింపిక్స్‌కు అర్హత.. చరిత్ర సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ జట్లు

ఒలింపిక్స్‌కు అర్హత.. చరిత్ర సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ జట్లు

భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో తొలిసారి జాతీయ పురుషులు మరియు మహిళల జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 15వ స్థానంలో ఉండగా, మహిళల జట్టు 13వ స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. 

ఈ ఏడాది జులై 16 నుంచి ఆగష్టు 11 వరకు పారిస్ వేదికగా సమ్మర్ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. ఈ పోటీల్లో దేశం తరుపున పురుషుల, మహిళల జట్లు పోటీపడనున్నాయి. గత నెలలో బుసాన్‌లో జరిగిన ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత జట్లు నేరుగా పారిస్ గేమ్స్‌కు అర్హత సాధించలేకపోయాయి. ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లోనే ఇంటిదారి పట్టాయి. భారత పురుషుల జట్టు దక్షిణ కొరియా  చేతిలో పరాజయం పాలవ్వగా, మహిళల జట్టు చైనీస్ తైపీ చేతిలో ఓటమిపాలైంది. అయినప్పటికీ, ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 16 జట్లు ఒలింపిక్స్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

చారిత్రాత్మక విజయం

భారత టేబుల్ టెన్నిస్ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం పట్ల క్రీడాకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశానికి ఈ విజయం ఒక గర్వకారణమని క్రీడా ప్రముఖులు కొనియాడుతున్నారు. "ఇది చాలా పెద్ద విజయం. దీని వెనుక ఎంతో శ్రమ దాగుంది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కోచ్‌లు, ఆటగాళ్లకు పెద్ద కృతజ్ఞతలు.." అని TTFI కార్యదర్శి కమలేష్ మెహతా అన్నారు.