విజయం లేకుండానే ఈ ఏడాదిని ముగించిన ఇండియా ఫుట్‌‌బాల్ టీమ్‌‌

విజయం లేకుండానే ఈ ఏడాదిని ముగించిన ఇండియా ఫుట్‌‌బాల్ టీమ్‌‌

 

  • మలేసియాతో  ఇండియా ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌‌ 1-1తో డ్రా

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియా ఫుట్‌‌బాల్‌‌ టీమ్‌ ఒక్క విజయం లేకుండానే ఈ ఏడాదిని ముగించింది. కొత్త కోచ్‌‌ మనోలో మార్క్వేజ్‌‌  బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన నాలుగో మ్యాచ్‌‌లోనూ ఇండియా గెలుపు రుచి చూడలేకపోయింది. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగిన ఫిఫా ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌‌లో ఇండియా 1–1తో మలేసియాతో డ్రా చేసుకుంది. 19వ నిమిషంలో మలేసియా ప్లేయర్‌‌‌‌ పాలో జోస్వె గోల్‌‌ చేసి తమ జట్టును 1–0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 39వ నిమిషంలో ఇండియా ప్లేయర్‌‌‌‌ రాహుల్‌‌ భెకె  చేసిన గోల్‌‌తో స్కోరు సమం అయింది.

 సెకండాఫ్‌‌లో ఎంత ప్రయత్నించినా మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్‌‌లో ఫలితం తేలలేదు. ఇండియా ఆటగాడు బ్రాండన్ ఫెర్నాండేజ్‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా నిలిచాడు.  కాగా, అక్టోబర్‌‌‌‌లో  ఇదే స్టేడియంలో జరిగిన ఇంటర్‌‌‌‌కాంటినెంటల్‌‌ కప్‌‌ టోర్నమెంట్‌‌లో సిరియా చేతిలో ఓడిన ఇండియా.. వియత్నాంతో డ్రా చేసుకుంది. మన జట్టు చివరగా గతేడాది నవంబర్‌‌‌‌లో వరల్డ్ కప్‌‌ క్వాలిఫయర్‌‌‌‌ మ్యాచ్‌‌లో కువైట్‌‌పై గెలిచింది. ఈ సీజన్‌‌లో చివరి మ్యాచ్‌‌లోనూ విజయం అందుకోలేకపోయిన ఇండియా వచ్చే మార్చిలో జరిగే ఏఎఫ్‌‌సీ ఆసియా కప్‌‌ క్వాలిఫయర్స్‌‌లోనే తిరిగి గ్రౌండ్‌‌లోకి రానుంది. 

గుర్‌‌‌‌ప్రీత్ తప్పిదం..  ఆదుకున్న రాహుల్‌‌ 

ఇరు జట్ల మధ్య ఆట ఆరంభం నుంచే నువ్వానేనా అన్నట్టు సాగింది. సొంతగడ్డ, ఈ మధ్యే రెండు మ్యాచ్‌‌లు ఆడిన వేదిక కావడంతో తొలుత బ్లూ టైగర్స్‌‌ టీమ్‌‌ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. బాల్‌‌ను తమ ఆధీనంలోకి తీసుకొని దాడులు చేసింది. అటు మలేసియా ఆటగాళ్లు కూడా మంచి పాసింగ్స్‌‌తో అవకాశం సృష్టించుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇండియా  గోల్‌‌ కీపర్‌‌ గుర్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ సంధు చేసిన తప్పిదంతో మలేసియా ఈజీగా ఖాతా తెరిచింది. మలేసియా ఆటగాళ్ల నుంచి బాల్‌‌ను క్లియర్‌‌‌‌ చేసేందుకు తను బాక్స్‌‌ను వదిలి ముందుకొచ్చాడు.  కానీ, బాల్‌‌ను కలెక్ట్ చేయలేకపోయాడు. చాకచక్యంగా బాల్‌‌ను ముందుకు తీసుకెళ్లిన పాలో ఖాళీగా ఉన్న  నెట్‌‌లోకి పంపి గోల్‌‌ చేయడంతో ఇండియా షాకైంది. 

దీంతో మలేసియా 1-–0తో ఆధిక్యంతో పాటు మానసిక పైచేయి సాధించింది.  తీవ్ర ఒత్తిడిలో బ్లూ టైగర్స్ టీమ్‌‌ మెరుగ్గా ఆడింది. వరుసగా ఎదురుదాడులతో జోరు పెంచింది. ఈ క్రమంలో ఫస్టాఫ్‌‌ ముంగిట కార్నర్‌‌ నుంచి  బ్రాండన్‌‌ ఫెర్నాండెజ్‌‌ అందించిన పాస్‌‌ను బాక్స్‌‌లో  మలేసియా డిఫెండర్లను తప్పిస్తూ   రాహుల్‌‌ హెడ్డర్‌‌‌‌తో గోల్‌‌ పోస్ట్‌‌లోకి పంపించడంతో స్టేడియంతో హోరెత్తించింది. దీంతో ఇరు జట్లు 1–1తో ఫస్టాఫ్ ముగించాయి. బ్రేక్ తర్వాత మరో గోల్‌‌ కోసం రెండు జట్లూ తీవ్రంగా శ్రమించాయి. కానీ, డిఫెన్స్‌‌ విభాగాలు బలంగా ఉండటంతో  ఫలితం దక్కలేదు. ఫస్టాఫ్‌‌లో అనూహ్య తప్పిదంతో  ప్రత్యర్థికి గోల్ ఇచ్చుకున్న ఇండియా కీపర్‌‌‌‌  గుర్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌  సెకండాఫ్‌‌లో మలేసియాకు అడ్డుగోడగా నిలిచి ఆకట్టుకున్నాడు. చివరి నిమిషం వరకూ ప్రత్యర్థి  ఆటగాళ్లు చేసిన  గోల్‌‌  ప్రయత్నాలను అతను సమర్థవంతంగా అడ్డుకున్నాడు.