భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్ లో జర్మనీతో ఓడిపోయినా.. మూడో స్థానం కోసం స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1 తేడాతో గెలిచి దేశానికి మెడల్ అందించింది. 2021 లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్య పతకం నెగ్గిన హాకీ టీం..పారిస్ ఒలింపిక్స్ లోనూ ఆ ఫీట్ రిపీట్ చేసింది. దీంతో వరుసగా రెండు సార్లు దేశానికి కాంస్య పతకాన్ని అందించాయి.
మెడల్ తో దేశంలోకి అడుగుపెట్టిన మన హాకీ టీంకు ఢిల్లీలో గ్రాండ్ గా స్వాగతం లభించింది. హర్మప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు శనివారం (ఆగస్టు 10) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హాకీ జట్టు తమ పతకాలను కెమెరాకు చూపించి తమదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది ఆటగాళ్ళు డ్రమ్స్ వాయిస్తూ.. మరికొందరు పంజాబీ భాంగ్రా డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
గురువారం జరిగిన కాంస్య పతక ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఇండియా 2–1తో స్పెయిన్‌ను చిత్తు చేసి మెగా గేమ్స్‌లో దేశానికి నాలుగో పతకం తెచ్చిపెట్టింది. టోర్నీ అసాంతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో డబుల్ ధమాకా మోగించాడు. స్పెయిన్ తరఫున మార్క్ మిరల్లెస్ 18వ నిమిషంలోనే గోల్ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లగా... హర్మన్ 30, 33 నిమిషాల్లో వెంటవెంటనే రెండు గోల్స్‌తో జట్టును గెలిపించాడు.
కాంస్య పతకాన్ని సాధించినందుకు గానూ పురుషుల హాకీ జట్టులోని ప్రతి సభ్యునికి హాకీ ఇండియా రూ. 15 లక్షల నగదు బహుమతిని, సహాయక సిబ్బందికి రూ.7.5 లక్షలతో పాటుగా ప్రకటించింది.ఒడిశా సిఎం మోహన్ చరణ్ మాంఝీ తన రాష్ట్రానికి చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రూ.4 కోట్ల ప్రత్యేక నగదు బహుమతిని ప్రకటించారు. అలాగే ప్రతి ఆటగాడికి రూ.15 లక్షలు.. సహాయక సిబ్బందికి రూ.10 లక్షలు బహుమతిగా ఇచ్చారు. మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాష్ట్రానికి చెందిన జట్టులోని ప్రతి సభ్యునికి రూ. 1 కోటి బహుమతిని ప్రకటించారు.