భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఎల్లలు దాటించి అంతర్జాతీయ వేదికలపై మన సంగీత ఖ్యాతిని చాటిన భారత కళామతల్లి ముద్దుబిడ్డ జాకీర్ హుస్సేన్. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా తనయుడే జాకీర్ హుస్సేన్. తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మూడేండ్లకే తబలా పట్టి 12 ఏండ్లకే అంతర్జాతీయ కచేరీలు నిర్వహించిన బాల మేధావి జాకీర్ హుస్సేన్.
పువ్వు పుట్టగానే పరిమళించును అన్న నానుడి జాకీర్ నిజం చేశాడు. హిందుస్థానీ సంగీతంలో అత్యంత నైపుణ్యం కలిగిన విద్వాంసుడైన ఆయన 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. 2024 డిసెంబర్ 16న తుది శ్వాస విడిచి సంగీత ప్రియులందరినీ కన్నీటి సముద్రంలో ముంచి వేశారు. ఆయన సంగీతం విన్న ఎవ్వరైనా "వాహ్ ఉస్తాద్" అనక మానరు.
ఆయన నటించిన ఒక ప్రకటన ‘వాహ్ తాజ్’ సంగీత
పామరులను సైతం ఆకట్టుకుంది. ఆయన విద్యాభ్యాసమంతా హైస్కూల్ విద్య నుంచి డిగ్రీ వరకు ముంబైలోనే కొనసాగింది. వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి సంగీతంలో డాక్టరేట్ పొందారు. ఆయన మొదటి ఆల్బమ్ 1991లో విడుదలై 1992లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ గా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు సాధించి సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ గ్రామీ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్.
ALSO READ : లెటర్ టు ఎడిటర్ : నిర్బంధ విద్యపై నిర్ణయాలు తీసుకోవాలి
అంతర్జాతీయ వేదికలపై భారతీయ శాస్త్రీయ సంగీతానికి అంబాసిడర్. భారతీయ సంగీతానికి గ్లోబల్ ఐకాన్. హిట్ అండ్ డస్ట్ (1983) సాజ్ (1998) చిత్రాల్లో కూడా నటించారు. సత్యజిత్ ఘరోండా, బెర్నార్డో బెర్టోలూచ్చి లిటిల్ బుద్ధా, రిచర్డ్ అటెన్బరో గాంధీ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. భారత ప్రభుత్వం ఆయన సంగీత ప్రతిభను గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి పురస్కారాలతో సత్కరించింది. అమెరికా ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక "నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్" పురస్కారంతో సత్కరించింది. ఇంతటి గొప్ప సంగీత ప్రతిభాశాలి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు.
- ఏకేవీ ప్రకాష్-