ఎప్పుడైనా.. ఎక్కడైనా.. రెడీ.. ఇండియన్ నేవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. రెడీ.. ఇండియన్ నేవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన నేవీ సిద్ధమవుతోంది. మూడు రోజుల కిందట్నే అరేబియా సముద్రంలో సీ స్కిమ్మింగ్ టెస్టులు చేసిన నేవీ అధికారులు.. తాజాగా ఆదివారం నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశామని వెల్లడిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా సుదూరంలోని టార్గెట్‎ను గురితప్పకుండా పేల్చేసే సామర్థ్యాన్ని పరీక్షించినట్లు నేవీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ టెస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. 

‘‘మన యుద్ధ నౌకలు యాంటీ షిప్ మిసైల్స్‌‌‌‌ను విజయవంతంగా పరీక్షించాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టాయి. సముద్ర జలాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని నేవీ పేర్కొంది. కాగా, సీ స్కిమ్మింగ్ టెస్ట్ లో భాగంగా ఐఎన్ఎస్ సూరత్ నౌకలో నుంచి మీడియం రేంజ్ క్షిపణి విధ్వంసక మిసైల్ ను నేవీ పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయాణించే ఈ మిసైల్.. ఆకాశంలోని  టార్గెట్‌‌‌‌ను కచ్చితత్వంతో ఛేదించిందని వెల్లడించింది.