భారత సిబ్బంది ఉన్న నౌకపై హౌతీల దాడి

  • రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ

న్యూఢిల్లీ:  ఎర్రసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ నౌకపై మిసైల్ దాడి జరిగింది. హౌతీ మిలిటెంట్లు మిసైల్ దాడి చేయడంతో ట్యాంకర్‌‌కు మంటలు అంటుకున్నాయి. 22 మంది ఇండియన్లు, ఒక బంగ్లాదేశీయుడు సిబ్బందిగా ఉన్న ఆ నౌక నుంచి ఇండియన్ నేవీకి అత్యవసర కాల్ వచ్చింది. దీంతో రెస్క్యూ కోసం యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ను నేవీ పంపింది.

మంటలను ఆర్పేందుకు, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని నేవీ తెలిపింది. ‘‘బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ ‘ఎంవీ మార్లిన్’పై క్షిపణి దాడి జరిగింది. షిప్‌లో మంటలు చెలరేగాయి” అని వివరించింది. దాడుల నుంచి కార్గో షిప్‌లను రక్షించేందుకు నేవీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. కాగా, జనవరి 17న, 5న, డిసెంబర్ 23న కూడా వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్ దాడులు చేశారు.