అమెరికా నౌకపై డ్రోన్‌ దాడి.. ఐఎన్ఎస్ విశాఖపట్నం సాయం

గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో డ్రోన్ దాడికి గురైన అమెరికన్ కార్గో నౌకకు భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ (INS) విశాఖపట్నం సాయం చేసింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో యాంటీ పైరసీ నిరోధక గస్తీని నిర్వహిస్తున్న INS విశాఖపట్నం జనవరి 17న రాత్రి 11:11 గంటలకు MV జెన్‌కో పికార్డీ నౌకకు తన వంతు సాయాన్నందించింది. జెన్‌కో పికార్డీ నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు చేసిన ఈ దాడిలో నౌక కొంతభాగం ధ్వంసమైంది. ఈ క్రమంలో తమకు సాయం కావాలంటూ వచ్చిన అభ్యర్థనపై స్పందించిందని భారత నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. భారత నావికాదళం ప్రమాద పిలుపుపై వేగంగా స్పందించింది. దీంతో ఐఎన్‌ఎస్ విశాఖపట్నం గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో మిషన్ కోసం మోహరించింది.

పర్షియన్ గల్ఫ్, సోమాలియా తీరం, ఏడెన్ గల్ఫ్‌లో మోహరించిన నేవీ యుద్ధనౌకలు పైరసీని అరికట్టగలవని, వాణిజ్య నౌకలను రక్షించగలవని కంట్రోలర్ పర్సనల్ సర్వీసెస్ ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ గుర్చరణ్ సింగ్ తెలిపారు. అంతకుముందు జరిగిన దాడి సమయంలో ఈ అమెరికా నౌకలో 22మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 9మంది భారతీయులే. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదని, మంటలు అదుపులోకి వచ్చాయని నేవీ తెలిపింది. ప్రస్తుతం నౌక సురక్షితంగా ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టిందని వెల్లడించింది.