
న్యూఢిల్లీ: భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో బ్రహ్మాస్తం చేరింది. కెనడాతో దౌత్యపరమైన విభేదాల నడుమ దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన నాలుగో న్యూక్లియర్ సబ్‌మెరైన్(ఎస్ఎస్బీఎన్) అరిఘాత్‌ను ఇండియన్ నేవీ ఆవిష్కరించింది. విశాఖ తీరంలోని షిప్ బిల్డింగ్ సెంటర్(ఎస్బీసీ) వద్ద ఈ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆవిష్కరించినట్టు తెలిసింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్
కేంద్రానికి శంకుస్థాపన చేసిన మరుసటిరోజు ఈ సబ్‌మెరైన్‌ను జలప్రవేశం చేయించినట్టు అధికార వర్గాల సమాచారం.
ఆగస్టులో నేవీకి అప్పగింత
ఎస్ఎస్బీఎన్ అరిఘాత్‌ను ఈ ఏడాది ఆగస్టు 29న నౌకాదళానికి రాజ్‌నాథ్ సింగ్ అప్పగించారు. దీన్ని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. 3,500 కిలో మీటర్ల దూరంలోని టార్గెట్‌ను సైతం ఛేదించేలా ఇందులో కే4 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్‌ను అమర్చారు. భద్రతా కారణాలరీత్యా వీటిని మొదట కోడ్ నేమ్‌తో పిలుస్తారు. ఇందులో భాగంగా దీనికి ‘ఎస్4 స్టార్’గా నామకరణం చేశారు. కాగా, వచ్చే ఏడాదికి ఈ శ్రేణిలో నాలుగో సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిధమాన్‌ను సిద్ధం చేయనున్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ సబ్మెరైన్లు కీలక పాత్ర పోషిస్తాయని భారత్ భావిస్తోంది.