బయటి దేశాల్లో మనోళ్ల రాజకీయం

ప్రపంచ రాజకీయాల్లో ఇండియా సంతతి ప్రజలు సత్తా చాటుతున్నారు. మూడు దేశాలకు ప్రధానులుగా పగ్గాలు చేపట్టారు. ఓ దేశానికి డిప్యూటీ పీఎం కాగలిగారు. కెనడాలో కింగ్​ మేకర్​లా చక్రం తిప్పారు. బ్రిటన్​ పార్లమెంటులో రికార్డ్​ స్థాయిలో బలం పెంచుకున్నారు. వివిధ దేశాల్లో ఎన్నారైల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో వరల్డ్​ పాలిటిక్స్​లో మరిన్ని వండర్లు సృష్టించే స్థాయికి ఇండియన్లు ఎదుగుతున్నారు.

విదేశాల్లో స్థిరపడ్డ ఇతర దేశాల ప్రజల సంఖ్యతో పోలిస్తే ఇండియన్లదే పైచేయి. యూఎన్​ఓ లేటెస్ట్ రిపోర్ట్​ ప్రకారం ప్రపంచ దేశాల్లోని ఎన్నారైల పాపులేషన్​ 2 కోట్ల 72 లక్షలకు చేరినట్లు అంచనా. వీళ్లు డాక్టర్లు, డెంటిస్టులు, లాయర్లు, బ్యాంకర్లు, బిజినెస్​మెన్లు, ఐటీ ఎక్స్​పర్ట్​లుగా సక్సెస్​ అవుతున్నారు. ఇదంతా ఒక వైపు అయితే, మరో వైపు మనోళ్లు పొలిటీషియన్లుగానూ రాణిస్తున్నారు.

భారత సంతతి వ్యక్తి జగ్మీత్​సింగ్​ చీఫ్​గా ఉన్న ఎన్​డీపీ.. కెనడా ఎన్నికల్లో 24 ఎంపీ స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఇందులో 18 మంది సిక్కులే. సర్కారుకు సపోర్ట్​ ఇవ్వడంతో జగ్మీత్​ సింగ్​.. కింగ్​ మేకర్​ అయ్యారు. 2017లో ఎన్​డీపీ ప్రెసిడెంట్​​ అయిన ఈయన ఒకానొక దశలో కాబోయే ప్రధాని అనే ప్రచారమూ జరిగింది. ముగ్గురు సిక్కులకు మంత్రి పదవులు రావటం, ఎన్​డీపీ తరఫున 18 మంది సిక్కులు గెలవటం కెనడాలో మనోళ్లు లిఖిస్తున్న కొత్త చరిత్రకు అద్దం పడుతోంది.  కెనడాలోని ఒక మేజర్​ పొలిటికల్​ పార్టీ (ఎన్​డీపీ)కి తొలిసారిగా ఓ నాన్​–వైట్​ పర్సన్​ అధ్యక్షుడు కావటంతో ఇతర దేశాల్లోని ఇండియా సంతతి రాజకీయ నాయకులు సాధించిన విజయాలు గుర్తుకొస్తున్నాయి.

పోర్చుగల్​ పీఎం ఎన్నారై కొడుకు

ఆంటోనియో కోస్టా 2015 నవంబర్​ నుంచి పోర్చుగల్​ ప్రధానిగా ఉన్నారు. ఆయనా ఒక ఎన్నారై కొడుకే. కోస్టా తండ్రి యువకుడిగా ఉన్నప్పుడే గోవా నుంచి లిస్బన్​కి వలస వెళ్లాడు. తర్వాత రైటర్​గా, కమ్యూనిస్ట్​ పార్టీ సభ్యుడిగా చేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్నే ఇప్పుడు కోస్టా నిలబెడుతున్నాడు.

ఐర్లాండ్​ పీఎంకి మహారాష్ట్ర మూలాలు

ఐర్లాండ్​కి 2017 జూన్​ నుంచి ప్రధానిగా ఉన్న లియో వరాద్కర్ మూలాలు మన దేశంలోనే మహారాష్ట్రలో ఉన్నాయి. ఆయన తండ్రిది ముంబై. సీనియర్​ వరాద్కర్​ కొన్నాళ్లు ఇంగ్లండ్​లో ఉండి ఐర్లాండ్​కి వెళ్లాడు. అక్కడామెనే పెళ్లి చేసుకున్నాడు. ఐర్లాండ్​లోనే పుట్టి పెరిగిన జూనియర్​ వరాద్కర్​ పాలిటిక్స్​కి రాకముందు తండ్రిలాగే మెడిసిన్​ చదివాడు. వెల్ఫేర్​ ప్రోగ్రామ్స్​లో అవినీతికి పాల్పడేవారిని విమర్శించేవాడు. ఖైదీలకు శిక్షా కాలానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. ప్రో–యూరప్​ విధానాలతో పాపులర్​ పొలిటీషియన్​ అయ్యారు. లియో వరాద్కర్​ తాను ‘గే’నని బహిరంగంగా ప్రకటించారు. ఆయన ప్రపంచంలో నాలుగో ‘గే ప్రైమ్​ మినిస్టర్​’గా రికార్డుకెక్కారు.

వీళ్లే కాకుండా దక్షిణాఫ్రికా, లాటిన్​ అమెరికాలోని గయానా, సురినామ్​ దేశాలలో కూడా ఇండియన్​ ఆరిజన్​గలవాళ్లు మంచి పదవుల్లో ఉన్నారు. ఆయా ప్రాంతాల్లోని తమ కాలనీలకు (వలసరాజ్యాలకు) బ్రిటిష్​వాళ్లు  ఇండియన్లను కాంట్రాక్ట్​ లేబర్​గా తీసుకెళ్లారు. అలా వెళ్లినవాళ్లలో చాలామంది వారసులు ఇప్పుడు పొలిటికల్​గా ఎదిగారు.

గయానా ప్రధానిగా కాంట్రాక్ట్​ లేబర్​ కొడుకు

గయానా ప్రధాని మోజెస్​ వీరాసామి నాగముత్తు తమిళియన్​. ఆయన భార్య పేరు సీత. వీళ్ల పూర్వీకులు బ్రిటిషర్ల కాలంలో కాంట్రాక్ట్​ లేబర్​గా గయానాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాగముత్తు లాయర్​గా, జర్నలిస్ట్​గా, రచయితగా పేరు తెచ్చుకొని, పాలిటిక్స్​లో ప్రవేశించారు. 2015లో గయానాకి పీఎంగా, వైస్​ ప్రెసిడెంట్​గా పగ్గాలు చేపట్టారు. లాటిన్​ అమెరికాలో బ్రెజిల్​, వెనెజులా, సురినామ్​ల సరిహద్దులతో గయానా దేశం ఉంది.

ఇటీవలి బ్రిటన్​ పార్లమెంట్​ ఎన్నికల్లో ఇండియా సంతతివాళ్లు రికార్డు స్థాయిలో 15 మంది గెలిచారు. అధికార కన్జర్వేటివ్​ పార్టీ టికెట్​పై ఏడుగురు, ప్రతిపక్ష​ లేబర్​ పార్టీ నుంచి ఏడుగురు, లిబరల్​ డెమొక్రటిక్​ పార్టీ తరఫున ఒక్కరు విజయం సాధించారు. 2015 ఎలక్షన్​లో ఎన్నారైలు 11 మందే సక్సెస్​ కాగా, ఈసారి వారితోపాటు ఈ మూడు పార్టీలకు చెందిన మరో నలుగురు ఎన్నికయ్యారు. గత కేబినెట్​లోని హోం మినిస్టర్ ప్రీతి పటేల్​, ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​ మినిస్టర్ అలోక్​ వర్మ, ఆర్థిక శాఖ చీఫ్​ సెక్రెటరీగా చేసిన ఇన్ఫోసిస్​ ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్​ ఈ ఎన్నికల్లోనూ విక్టరీ కైవసం చేసుకున్నారు.

ధర్మన్​ షణ్ముగరత్నం

ధర్మన్​కూడా తమిళియనే. వృత్తి రీత్యా ఎకనమిస్ట్​. ధర్మన్​ కెరీర్​ ఎక్కువగా సింగపూర్​ సెంట్రల్​ బ్యాంక్​లోనే సాగింది. పాలిటిక్స్​లోకి అరంగేట్రం చెయ్యక ముందు సింగపూర్​ ఎడ్యుకేషన్​, ఫైనాన్స్​ మినిస్టర్​గా చేశారు. ఆ తర్వాత ఉప ప్రధానమంత్రిగా ప్రమోషన్​ పొందారు. సింగపూర్​లో మొదటినుంచీ ఇండియన్లు పెద్ద సంఖ్యలోనే ఉంటూ వచ్చారు. ఆ దేశ జనాభాలో ఇండియా సంతతి ప్రజలు ఐదు శాతం కన్నా ఎక్కువే ఉన్నారు. 1970ల్లో కేంబ్రిడ్జిలో  చదువుకునే రోజుల్లో యూనివర్సిటీ పాలిటిక్స్​లో చురుగ్గా ఉండేవారు.

సురినామ్​ వైస్​ ప్రెసిడెంట్​ మనోడే

అశ్విన్​ అధిన్ 2015లో 35వ ఏటే సురినామ్​ దేశానికి వైస్​ ప్రెసిడెంట్​ అయ్యారు. అక్కడి పద్ధతుల ప్రకారం కేబినెట్​ని లీడ్​ చేసేది వైస్​ ప్రెసిడెంటే. ఆయన పూర్తి పేరు మైఖేల్​ అశ్విన్​ సత్యేంద్ర అధిన్​. ఆ పదవిని అతి చిన్న వయసులోనే చేపట్టి రికార్డులకెక్కారు.. ఇండియన్​ ఇమిగ్రేషన్​ వేడుకల్లో సురినామ్​ ప్రెసిడెంట్​ దృష్టిలో అశ్విన్​ పడ్డారు. అతనిలో ప్రతిభను గుర్తించి ఎంకరేజ్​ చేశారు.

కెనడాలో కొత్త చరిత్ర

అక్టోబర్​లో జరిగిన ఫెడరల్​ ఎలక్షన్​లో గెలిచి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిబరల్​ పార్టీ లీడర్​ జస్టిన్​ ట్రుడ్యూ తన కేబినెట్​లో అనితాఆనంద్​ అనే హిందూ మహిళకు ఛాన్స్​ ఇచ్చారు. కెనడా మంత్రివర్గంలో హిందూ మహిళకు చోటు లభించటం ఇదే తొలిసారి. ఆమెతోపాటు ముగ్గురు సిక్కులకూ (నవ్​దీప్​ బెయిన్స్​, బర్దిష్​ ఛాగ్గర్​, హర్జిత్​ సజ్జన్​లకూ​) బెర్త్​ దొరికింది. ఈ ఎన్నికల్లో అధికార లిబరల్​ పార్టీకి మేజిక్​ ఫిగర్​ కన్నా 13 సీట్లు తక్కువ వచ్చాయి. ఆ లోటు న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్​డీపీ) సభ్యులు బయటనుంచి సపోర్ట్ చేయడంతో భర్తీ అయ్యింది.

అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ…

అమెరికా పాలిటిక్స్​లో ఎన్నారైలు అన్ని స్థాయిల్లోనూ అదరగొడుతున్నారు. మేయర్లు, సెనేటర్లు, స్టేట్​ రిప్రజంటేటివ్స్​, సిటీ కౌన్సిల్​ మెంబర్స్​గా ముందుకు సాగుతున్నారు. డెమొక్రటిక్​ పార్టీ కీలక నేతగా కమలా హారిస్​ ఒక దశలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీదారుగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులతో ఈమధ్యే తప్పుకున్నారు.  నిక్కీ హేలీ.. దక్షిణ కేరొలినా తొలి మహిళా గవర్నర్. మైనారిటీ వర్గం నుంచి ఆ పదవి పొందిన తొలి వ్యక్తి. చిన్న వయసులో గవర్నర్ అయిన వ్యక్తిగా ఆమె 2010లో రికార్డు సృష్టించారు.  2014లో తిరిగి గవర్నర్​గా ఎన్నికై 2016లో ట్రంప్ ప్రభుత్వంలో చేరేవరకు కొనసాగారు. 2017లో ఐరాసలో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. 2018 అక్టోబర్​లో ఆ పదవికీ గుడ్​బై చెప్పారు.  ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ పాలిటిక్స్​లో పవర్​ చూపుతున్న మనోళ్లు ఎందరో.

For More News..

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు

ఇప్పుడు కండక్టర్‌.. రేపు కలెక్టర్‌..

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం