- మార్చి క్వార్టర్లో రూ. 4,837 కోట్లు
- ఇంధన ధరల తగ్గుదలతో ఇబ్బందులు
- పడిపోయిన మార్జిన్లు
న్యూఢిల్లీ: పెట్రోకెమికల్ వ్యాపారంలో నష్టాలకుతోడు, మార్జిన్లు తగ్గిపోవడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో నికరలాభం సగానికి సగం తగ్గింది. ఈసారి కేవలం రూ. 4,837.69 కోట్ల లాభం రాగా, గత ఏడాది మార్చి క్వార్టర్లో రూ. 10,058.69 కోట్లు వచ్చాయి. అంటే లాభంలో 49 శాతం తగ్గుదల కనిపించింది. అంతకు ముందు అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో రూ. 8,063.39 కోట్ల లాభం సంపాదించింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ, గత నెలలో కంపెనీ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 2 చొప్పున తగ్గించింది.
వంట గ్యాస్ ధరలను మార్చపోకపోవడం వల్ల కంపెనీకి వచ్చిన రూ. 1,017 కోట్ల నష్టానికి కేంద్రం పరిహారం చెల్లించలేదు. 2023–-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు) రూ. 39,618.84 కోట్ల నికర లాభం సాధించింది. పెట్రోలు, డీజిల్ ధరలను దాదాపు రెండేళ్లపాటు స్తంభింపజేయడం వల్ల వార్షిక లాభం పెరిగింది. 2022లో రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ముడి చమురు ధరలు పెరిగాయి. అయితే, 2023లో చాలా వరకు అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గాయి. ఫలితంగా ఐఓసీ వంటి కంపెనీలు మంచి లాభాలను పొందాయి. ఈ ఏడాది మార్చి మధ్యలో పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 చొప్పున తగ్గించారు. ముడి చమురు ధరలు పెరగడం ప్రారంభించినప్పుడు ఇలా జరిగింది. ప్రస్తుతం చమురు పీపా సగటు ధర 89.52 డాలర్లు ఉంది.
పెట్రోకెమ్ నుంచి రూ.400 కోట్ల నష్టం
మార్చి క్వార్టర్లో పెట్రోకెమికల్స్ వ్యాపారంలో ఐఓసీ సుమారు రూ. 400 కోట్ల నష్టాన్ని చవిచూడగా, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాలు 38 శాతం తగ్గాయి. కంపెనీ ఈ క్వార్టర్లో 23.73 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించింది. ఒక సంవత్సరం క్రితం 22.95 మిలియన్ టన్నులు అమ్మింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇంధన విక్రయాలు 92.31 మిలియన్ టన్నులు. మార్చి క్వార్టర్లో ఆదాయం వార్షికంగా రూ.2.28 లక్షల కోట్ల నుంచి రూ.2.21 లక్షల కోట్లకు పడిపోయింది.
పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం (2022–23లో) అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.9.41 లక్షల కోట్ల నుంచి రూ.8.71 లక్షల కోట్లకు పడిపోయింది. 2023–-24లో ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 12.05 డాలర్లు ఆర్జించామని, గత ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్ 19.52 డాలర్లు తగ్గిందని ఐఓసీ తెలిపింది. ఇదిలా ఉంటే, ఐఓసీ 2023–-24 సంవత్సరానికి ఈక్విటీ షేర్‌కు రూ.7 ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. గతంలో చెల్లించిన ఒక్కో షేరుపై రూ.5 మధ్యంతర డివిడెండ్‌కి ఇది అదనం.