న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈసారి సరికొత్త అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్‌లైనర్‌లో ప్రయాణించనున్నారు. మంగళవారం (మే 7, 2024న) భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ మూడో సారి అంతరిక్ష ప్రయాణం ప్రారంభిస్తారు.
ISS కి స్టార్ లైనర్ ప్రయాణానికి దాదాపు 26 గంటలు పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో విలియమ్్, విల్మోర్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద నాసా సర్టిఫికేషన్ కోసం అంతరిక్ష నైకత సంసిద్దత పరీక్షలు నిర్వహిస్తారు. ఒకసారి డాక్ చేసిన తర్వాత 8రోజుల పాటు అంతర్జాతీయ స్పేస్ సెంటర్ లో నివసిస్తారు..పరిశోధనలు చేస్తారు. అనంతరం మే 15న అన్ డాకింగ్ చేసి తిరిగి భూమికి రానున్నారు. ఇంతకుముందులా సముద్రంలో స్మాష్ చేయబడిన యూఎస్ క్యాప్సుల్లా కాకుండా ఈసారి స్టార్ లైనర్ పశ్చిమ యునైటెడ్ స్టేట్స్ లోని భూమి మీద సురక్షితంగా ల్యాండ్ కానుంది.
భారతీయ సంతతి అయిన డాక్టర్ దీపక్ పాండ్యా , బోనీ పాండ్యా దంపతులకు జన్మించిన 59 ఏళ్ల సునీత విలియమ్స్.. మానవ-రేటెడ్ అంతరిక్ష నౌక తొలి మిషన్‌లో ప్రయాణించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించనుంది.
సునీతా విలియమ్స్ కు అంతరిక్షయానంలో అపారమైన అనుభవం ఉంది. క్వాలిఫైడ్ నేవీ టెస్ట్ పైలట్ అయిన ఆమె ఇంతకు ముందు 2006, 2012లో రెండుసార్లు అంతరిక్షంలోకి ప్రయాణించింది. మొదటి సారి అంతరిక్ష యాత్ర సమయంలో నాలుగు సార్లు అంతరిక్షంలో నడక సాగించిన మహిళగా చరిత్ర సృష్టించింది. సునీతా విలియమ్స్ మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. సునీతా విలియమ్స్ యూఎస్ నావల్ అకాడ మీ నుంచి ఫిజికల్ సైన్స్ డిగ్రీని , ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
ఇదిలా ఉంటే.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. భారతదేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం గగన్ యాన్ ను అభివృద్ది చేస్తోంది. భారతీయ సముద్ర జలాల్లో దిగడం ద్వారా భూమికి సురక్షితంగా తిరిగి రావడానికి మూడు రోజుల మిషన్ కోసం ముగ్గురు వ్యోమగాములను 400 కిమీ కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం ద్వారా మానవ సహిత అంతరిక్ష యాతర్ చేయడం ఈ గగన్ యాన్ లక్ష్యం.
ఇందుకోసం 2024 ఫిబ్రవరి లో ప్రధాని మోదీ 2024-25 లో ప్రారంభం కానున్న గగన్ యాన్ మిషన్ లో వ్యోమగాములుగా భాగమయ్యే నలుగురు భారతీయ వైమానిక దళ పైలట్లను ఎంపిక చేశారు.