- బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సమస్యలు
- అందులోనే వస్తే పేలిపోయే ప్రమాదం
- మరో స్పేస్ క్రాఫ్ట్ పంపే విషయమై కసరత్తు చేస్తున్న నాసా
వాషింగ్టన్: ఎనిమిది రోజుల మిషన్ కోసమని అంతరిక్షానికి వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్.. 78 రోజులు అయినా భూమికి తిరిగి రాలేదు. జూన్ 5న అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోర్తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లిన ఆమె.. జూన్ 14న తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఆమె అక్కడే చిక్కుకుపోయారు. దీంతో సునీత డేంజర్లో పడ్డారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు స్టార్ లైనర్‌లో సమస్యలను సరిచేసి, సునీత, విల్ మోర్లను క్షేమంగా భూమికి తీసుకురావడంపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కసరత్తు చేస్తోంది.
ఇంతకూ ఏం జరిగింది?
అంతరిక్షానికి ఆస్ట్రోనాట్లను తీసుకెళ్లేందుకు బోయింగ్ కంపెనీ తయారుచేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు జూన్ 5న నాసా మిషన్ చేపట్టింది. ఇందులో మిషన్ కమాండర్‌గా బ్యారీ విల్ మోర్, పైలట్‌గా సునీతా విలియమ్స్ స్పేస్‌కు వెళ్లారు. మిషన్ ప్రారంభానికి ముందు కూడా సాంకేతిక సమస్యలతో ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది. చివరకు జూన్ 5న మిషన్ స్టార్ట్ అయింది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ను అట్లాస్ రాకెట్ విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. కానీ స్టార్ లైనర్‌లో ఉన్న 28 థ్రస్టర్లలో 5 థ్రస్టర్లు ఫెయిల్ కావడం, హీలియం గ్యాస్ లీక్ అవుతుండటంతో జూన్ 14 చేపట్టాల్సిన రీఎంట్రీ మిషన్ వాయిదా పడింది.
తేడా వస్తే.. ఆవిరైపోతారు!
సునీత, విల్ మోర్లు భూమికి స్టార్ లైనర్ లోనే తిరిగి రావాలంటే.. ప్రధానంగా మూడు గండాలు దాటాల్సి ఉంటుందని చెప్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ తిరుగు ప్రయాణంలో మరిన్ని థ్రస్టర్లు ఫెయిలై.. అది నిటారుగా భూవాతావరణంలోకి ప్రవేశిస్తే గనక.. హీట్ షీల్డ్ ఫెయిలై భగ్గుమని మండిపోతుంది. ఆస్ట్రోనాట్లు క్షణాల్లో ఆవిరైపోతారు. అలాకాకుండా స్పేస్ క్రాఫ్ట్ మరీ వాలుగా భూవాతావరణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే.. అది అంతరిక్షంలోకి తిరిగి బౌన్స్ అయి కొట్టుకుపోతుంది. స్పేస్ క్రాఫ్ట్‌లోని ఆక్సిజన్, కరెంట్ కేవలం 96 గంటలకు సరిపోతుంది. కాబట్టి ఆ లోపు సునీత, విల్ మోర్లను కాపాడకపోతే వారి ప్రాణాలకు ముప్పు తప్పదు. ఇక రిస్క్ ఎందుకని ప్రత్యామ్నాయంగా.. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌ను ఎంచుకుంటే... ఆ మిషన్‌ను సెప్టెంబర్‌లో చేపట్టేందుకు అవకాశం ఉంది.
నాసా ఏం చేస్తోంది?
బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ను మరోసారి టెస్ట్ చేసేందుకు నాసా ఇంజనీర్లు ఇటు భూమిపై, అటు స్పేస్‌లో స్పేస్ క్రాఫ్ట్ వ్యవస్థల పనితీరుపై టెస్టులు చేస్తున్నారు. కానీ ఎన్నిసార్లు టెస్ట్ చేసినా.. స్పేస్ క్రాఫ్ట్‌లో హీలియం లీక్స్, థ్రస్టర్లు ఓవర్ హీట్ వంటి సమస్యలు రిపీట్ అవుతున్నాయి. దీంతో ఈ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా భూమికి దిగుతుందా? లేదా? అన్న దానిపై ఆందోళన నెలకొంది. ఒకవేళ దీనికి ప్రత్యామ్నాయంగా స్పేఎస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌ను పంపితే.. బోయింగ్ స్టార్ లైనర్ ప్రాజెక్టుకు నాసా కేటాయించిన 4.2 బిలియన్ డాలర్ల వ్యయం ప్రశ్నార్థకం అవుతుంది. వారం రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.