- అలబామాలో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ తెలుగు డాక్టర్ హత్యకు గురయ్యారు. ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన డాక్టర్ రమేశ్ బాబు పెరంశెట్టిని అలబామా స్టేట్ లోని టుస్కలూసా సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం కాల్చి చంపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే చనిపోయారు. డాక్టర్ రమేశ్ బాబుకు భార్య, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే, ఆయన హత్య వెనక ఉన్న కారణాలు ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు. వైద్య రంగంలో 38 ఏండ్ల అనుభవం ఉన్న డాక్టర్ రమేశ్ బాబు అమెరికాలో ప్రఖ్యాత ఫిజిషియన్ గా పేరు పొందారు.
టుస్కలూసా సిటీతోపాటు మరో నాలుగు చోట్ల ఎమర్జెన్సీ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ లో ప్రముఖ స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. క్రిమ్సన్ కేర్ నెట్ వర్క్ పేరుతో హాస్పిటల్స్ నెలకొల్పి, వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. వైద్య రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా టుస్కలూసా సిటీలో ఓ వీధికి ఆయన పేరు పెట్టి స్థానిక ప్రభుత్వం గౌరవించింది. కరోనా విపత్తు సమయంలోనూ ఆయన గణనీయమైన సేవలు చేశారని, అందుకు గుర్తింపుగా అవార్డులు కూడా అందుకున్నారని క్రిమ్సన్ కేర్ సంస్థ తెలిపింది. ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన డాక్టర్ రమేశ్ బాబు మెనకూరు హైస్కూల్ లో చదువుకున్నారు. తాను చదువుకున్న స్కూల్ ను ఆధునీకరించడం కోసం ఆయన రూ. 14 లక్షలు విరాళం ఇచ్చారు. సొంత గ్రామంలో సాయిబాబా టెంపుల్ నిర్మాణానికి కూడా భారీగా విరాళం ఇచ్చినట్టు తెలుస్తోంది.