- నలుగురు అరెస్ట్
ఒట్టావా:కెనడాలో దారుణం జరిగింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి యువరాజ్ గోయల్ (28) హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు. జూన్ 7న ఈ ఘటన జరిగిందని కెనడియన్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు సోమవారం వెల్లడించారు. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన యువరాజ్.. హయ్యర్ స్టడీస్ కోసం 2019లో కెనడా వచ్చారని తెలిపారు.
ప్రస్తుతం సర్రేలోనే కార్ డీలర్‌షిప్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఇటీవల అతనికి కెనడియన్ పర్మనెంట్ రెసిడెంట్ హోదా కూడా వచ్చిందన్నారు. దినచర్యలో భాగంగా శుక్రవారం జిమ్ కి వెళ్లాడని.. తిరిగి ఇంటికి చేరుకుని తన కారు నుంచి దిగుతుండగా యువరాజ్ గోయల్ పై కొందరు కాల్పులు జరిపారని వివరించారు. ఘటనలో అతను అక్కడికక్కడే -మృతి చెందినట్లు వెల్లడించారు.
కాల్పులు జరిగిన కొద్దిసేపటికే పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. సర్రేకు చెందిన మన్వీర్ బస్రామ్(23), సాహిబ్ బస్రా(20), హర్కీరత్ జుట్టి( 23), అంటారియోకు చెందిన కెయిలాన్ ఫ్రాంకోయిస్- ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై మర్డర్ కేసు నమోదు చేశారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపిన పోలీసులు..యువరాజ్ గోయల్ హత్యకు కారణాలేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు.