ఒట్టావా: కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పీఎం పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి గుడ్ బై చెబుతున్నట్లు ట్రూడో అనౌన్స్ చేశారు. పార్టీ నుండి రోజు రోజుకు అసమ్మతి రాగం మరింత ఊపందుకోవడంతో గత్యంరం లేక పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ట్రూడో ప్రకటించారు. పార్టీ నూతన ప్రధానిని ఎన్నుకునే వరకు తాత్కలిక పీఎంగా కొనసాగుతానని తెలిపారు. ట్రూడో పదవి నుండి తప్పుకోవడంతో అధికార లిబరల్ పార్టీ తదుపరి ప్రధాని ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండటంతో ప్రధాని ఎంపిక విషయంలో అధికార పార్టీ అచీతూచీ వ్యవహరిస్తోంది.
కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు 90 రోజులు గడువు ఉండటంతో అన్ని అంశాలను పరిశీలించి ప్రధానిని సెలెక్ట్ చేసేందుకు లిబరల్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో అధికార లిబరల్ పార్టీ నుండి ప్రధాని పదవి కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాని పదవి చేపట్టేందుకు తాము సిద్ధమని ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే కెనడాకు చెందిన భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య కెనడా పీఎం రేసులోకి వచ్చారు. ప్రధాని పదవి కోసం తాను పోటీలో ఉన్నట్లు చంద్ర ఆర్య సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
తాను ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటే చేపట్టే సంస్కరణలు గురించి ఆయన వెల్లడించారు. 2040లో పదవీ విరమణ వయస్సును రెండేళ్లు పెంచడం, పౌరసత్వం-ఆధారిత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం, పాలస్తీనాను రాష్ట్రంగా గుర్తించడం, కెనడాను సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. భారత్‌లోని కర్నాటకలో జన్మించిన చంద్ర ఆర్య ప్రస్తుతం కెనడా రాజధాని ఒట్టావా పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్ర ఆర్య కుటుంబీకులు చిన్నప్పుడే కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
ALSO READ | H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
కెనడా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆర్య.. ప్రస్తుతం ఆ దేశ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఖలీస్థానికి వ్యతిరేకంగా.. హిందూ కెనడియన్లకు మద్దతుగా ఉంటారు ఆర్య. సిక్కు వేర్పాటువాదుల విషయంలో తన పార్టీకి లైన్‌కు వ్యతిరేకంగా ఎంపీ ఆర్య నిరసన గళం విప్పుతుంటారు. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణాల్లో ఖలీస్థాని కూడా ఒకటి. సిక్కు ఏర్పాటువాదులకు మద్దతు పలుకుతూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు ట్రూడో.
ఖలిస్తానీ టెర్రరిస్ట్ హరదీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత్ పై ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కెనడాలో హత్యకు గురి అయిన నిజ్జర్ మర్డర్ వెనక భారత్ హస్తం ఉందని ట్రూడో పలుమార్లు ఆరోపించారు. నిజ్జర్ విషయంలో ట్రూడో వ్యవహరించిన తీరుతో భారత్, కెనడా దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్రూడో అధికారంలో ఉన్నన్ని రోజులు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వగా.. ఇప్పుడు అదే కెనడా ప్రధాని పదవి కోసం భారత సంతతి ఎంపీ రేసులోకి రావడం హాట్ టాపిక్‌గా మారింది.