ఓపెన్ ఏఐ విజిల్‌ బ్లోయర్ అనుమానాస్పద మృతి

ఓపెన్ ఏఐ విజిల్‌ బ్లోయర్ అనుమానాస్పద మృతి
  • అమెరికాలోని తన అపార్ట్‌‌మెంట్‌‌లో 
  • చనిపోయినట్లు గుర్తించిన పోలీసులు
  • ఓపెన్‌‌ ఏఐ ఆపరేషన్లు, విధానాలు 
  • ఆందోళనకరంగా ఉన్నట్టు గుర్తించిన బాలాజీ 
  • ఆరోపణలు చేసిన 3 నెలలకే సూసైడ్

న్యూయార్క్:  చాట్​ జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్​ ఏఐ’ కంపెనీ ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్ మాజీ రీసెర్చర్, విజిల్​బ్లోయర్​ సుచిర్​ బాలాజీ (26) అనుమానాస్పదంగా మృతిచెందాడు.  ఇండియన్​ అమెరికన్​ అయిన అతడు శాన్​ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్​మెంట్​లో శవమై కనిపించాడు. బాలాజీ సూసైడ్​ చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.

అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం అతడు గత నెల 26న బుచనాన్​స్ట్రీట్​లోని తన అపార్ట్​మెంట్​లో సూసైడ్​ చేసుకున్నాడు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్​ అనంతరం ఇది ఆత్మహత్య అని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.  

ఓపెన్​ ఏఐపై ఆరోపణలు చేసిన 3 నెలలకే..

లింక్డిన్‌‌ ప్రొఫైల్ ప్రకారం..  2020 నవంబర్‌‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఓపెన్‌‌ ఏఐలో బాలాజీ విధులు నిర్వర్తించాడు. దీనిపై రీసెర్చ్​ చేసిన అతడు ఓపెన్​ఏఐపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కంపెనీ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నాయని వెల్లడించాడు.  అనుమతిలేకుండా ఇంటర్నెట్​నుంచి స్క్రాప్​ చేసిన కాపీరైట్​ మెటీరియల్​పై కంపెనీ ఏఐ మోడల్​లు శిక్షణ పొందాయని ఆరోపించాడు. ఇది చాలా హానికరమని పేర్కొన్నాడు.

ఇది మొత్తం ఇంటర్నెట్​ ఎకో సిస్టమ్​కే సస్టైనెబుల్​ మోడల్​ కాదని పేర్కొన్నాడు. ఓపెన్ ఏఐ కంపెనీ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని గత నెల తన బ్లాగ్​లో రాసుకొచ్చాడు. ​సమాజానికి మేలు కంటే హానిచేసే టెక్నాలజీ కోసం తాను పనిచేయాలని కోరుకోవడం లేదని, అందుకే ఓపెన్​ ఏఐ సంస్థ నుంచి బయటకొచ్చానని న్యూయార్క్​ టైమ్స్​ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, ఓపెన్ ఏఐపై ఆరోపణలు చేసిన 3 నెలలకే సుచిర్​ బాలాజీ మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. 

స్పందించిన ఎలాన్​ మస్క్​

సుచిర్ బాలాజీ మృతిపై బిలియనీర్ ఎలాన్​ మస్క్​ స్పందించారు. ఓ వ్యక్తి చేసిన ట్వీట్​ను ‘హ్మ్’ ​అంటూ రీపోస్ట్​ చేశారు.  ఓపెన్​ ఏఐను 2015లో శామ్​ అల్ట్​మన్​తో కలిసి మస్క్​ ప్రారంభించారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 3 ఏండ్ల తర్వాత విడిపోయారు.  అనంతరం ఓపెన్ ఏఐకు పోటీగా ఎక్స్​ ఏఐను మస్క్​ ప్రారంభించారు.

కాగా,  ఓపెన్​ ఏఐ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నదని గత నెల మస్క్​ ట్వీట్​ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్‌‌ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్‌‌ వేదిక గా ఎలాన్‌‌ మస్క్‌‌ స్పందించడం చర్చనీయాంశంగా మారింది.