సూపర్ విమెన్: వారంలో ఐదు రోజులు.. రోజూ విమానంలో 700 కి.మీ. ప్రయాణం

సూపర్ విమెన్: వారంలో ఐదు రోజులు.. రోజూ విమానంలో 700 కి.మీ. ప్రయాణం

ఆఫీసుకి వెళ్లాలంటే.. ఆటో, బస్సు లేదా సొంత బైక్, కారులో గట్రా వెళ్తారు. కానీ, ఈ భారత సంతతి మహిళ మాత్రం రోజూ 7౦౦ కిలోమీటర్లు విమానంలో ప్రయాణించి మరీ ఆఫీసుకి వెళ్తోంది. ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా..! ఇది అక్షరాలా నిజం. అలా అని ఈమె ఓ కంపెనీకి సీఈఓనూ కాదు..  జీతం కోట్లలోనూ లేదు. ఈమె సంపాదించేంది తక్కువే అయినా విమానంలో ప్రయాణించడానికి ఓ పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్.. మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రంలో నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. ఉద్యోగం.. దేశ రాజధాని నగరమైన కౌలాంలపూర్‌. ఎయిర్ ఏషియా ఫైనాన్స్ ఆపరేషన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌. ఉంటున్న పెనాంగ్ రాష్ట్రానికి, ఉద్యోగం చేసే కౌలాంలపూర్‌ కు మధ్య దూరం చాలా ఎక్కువ. అలా అని రాజధాని నగరంలో ఉండే పరిస్థితి లేదు. అందుకు కారణం.. ఇంటి అద్దె, వారం వారం ఇంటికెళ్లి రావడానికి అయ్యే ఖర్చులు. ఆ ఖర్చుతో పోలిస్తే, వారంలో ఐదు రోజులు విమానంలో ప్రయాణించిన అంత కావట్లేదట. అంతేకాదు, కుటుంబాన్ని మిస్ అవుతున్నానన్న చింతా లేదు.

ప్రతినెలా రూ.14 వేలు ఆదా.. 

రోజూ ఉదయం 5 గంటలకు పెనాంగ్ రాష్ట్రంలోని ఇంటి నుండి బయల్దేరి.. 7.45 గంటలకు కౌలాలంపూర్‌ చేరుకుంటుంది. అక్కడ పని పూర్తయ్యాక సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరిది.. తిరిగి రాత్రి 8 గంటలకల్లా ఇంటికి చేరుకుంటుంది. ఇలా వారంలో 5 రోజులు విమానాల్లో రాకపోకలు సాగిస్తోంది. దీనివల్ల ఉద్యోగ- కుటుంబజీవితం సమతూకంగా ఉండటంతోపాటు ప్రతినెలా రూ.14 వేలు ఆదా అవుతున్నాయట 

ALSO READ | తెలంగాణకు 2 బుల్లెట్ రైళ్లు : బెంగళూరు, చెన్నైలకు 2 గంటలే జర్నీ

"నాకు ఇద్దరు పిల్లలు.. ఇద్దరూ పెద్దవాళ్లు అవుతున్నారు. కొడుక్కి 12 సంవత్సరాలు, కూతురికి 11 సంవత్సరాలు. వారు పెరుగుతున్న కొద్దీ తల్లిగా వారి చుట్టూ ఉండాలని నాకనిపించింది. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నా.. పిల్లలతో సాయంత్రాలు గడపడానికి వీలుగా ఉంది. ఆఫీసు దగ్గర ఇల్లు అద్దెకు తీసుకోవడం కంటే ఇది చౌకైనదే.. " అని రాచెల్ కౌర్ చెప్పుకొచ్చింది. ఈమె కథ తెలిసిన వారంతా 'సూపర్ కమ్యూటర్' అని పిలుస్తున్నారు.