మెక్సికోలో డ్రగ్-గ్యాంగ్ మధ్య జరిగిన కాల్పుల్లో అమెరికాకు చెందిన భారతీయ సంతతికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (టెక్కీ) మరియు ట్రావెల్ బ్లాగర్, జర్మన్ టూరిస్ట్ మృతి చెందారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించగా భారత్ లోని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అంజలి టెకీ మరియు ట్రావెల్ బ్లాగర్ అని గుర్తించారు.
అమెరికాలోని శాన్ జోస్‌లో నివసిస్తున్నట్లు వెల్లడైంది. క్యాలిఫోర్నియా శాన్‌జోస్‌లోని లింక్‌డ్‌ఇన్ కంపెనీలో పనిచేస్తున్న అంజలి తన పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడం కోసం బుధవారం మెక్సికోలోని తులుమ్‌కు వెళ్లింది. అక్కడ మరో నలుగురు విదేశీ పర్యాటకులతో కలసి లా మల్క్వెరిడా రెస్టారెంట్ టెర్రస్‌పై భోజనం చేస్తుండగా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు పక్కనే ఉన్న టేబుల్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం.
హోటల్‌లో రెండు డ్రగ్స్ గ్యాంగ్‌ల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో అంజలితో పాటు మరో జర్మన్ టూరిస్ట్ దుర్మరణంపాలయ్యారు. మరో జర్మన్, నెదర్లాండ్ వాసికి బుల్లెట్ గాయాలయ్యాయి. అంజలి గతంలో యాహూలో పనిచేసి.. గత జులై నెలలోనే లింక్‌డ్‌ఇన్ కంపెనీలో చేరినట్లు తెలుస్తోంది.