
- ఆపై నిద్ర మాత్రలు మింగి మహిళ ఆత్మహత్యాయత్నం
- పదకొండేళ్ల బాబు మృతి, చికిత్సతో కోలుకున్న తల్లి
న్యూయార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఓ మహిళ తన కొడుకును చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. కొడుకు మృతిచెందగా.. ప్రాణాలతో బయటపడ్డ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే.. వర్జీనియాకు చెందిన సరితా రామరాజు(48) భర్తతో మనస్పర్థల కారణంగా 2018లో విడాకులు తీసుకుంది. వారిద్దరికీ ఓ కొడుకు ఉండగా.. పదకొండేళ్ల ఆ బాబు బాధ్యతలను న్యాయస్థానం భర్తకు అప్పగించింది.
తల్లికి అప్పుడప్పుడు కలిసే చాన్స్ ఇచ్చింది. ఇటీవల తన కొడుకును చూసుకునేందుకు సరిత కాలిఫోర్నియా వెళ్లింది. అక్కడే ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నది. విహార యాత్రకోసం డిస్నీల్యాండ్‌లో పాస్‌లు కూడా తీసుకున్నది. బాబును తిరిగి తండ్రికి అప్పగించాల్సిన టైమ్ రావడంతో మార్చి 19న ఉదయం లోకల్ పోలీసులకు ఫోన్ చేసి, కొడుకును హతమార్చింది. ఆపై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంచేసింది.
పోలీసులు వచ్చే చూసేసరికి బాలుడు చనిపోయి ఉండగా.. సరితారామరాజు ప్రాణాలతో ఉన్నది. వెంటనే ఆమెను దవాఖానలో చేర్చగా కోలుకుని డిశ్చార్జి అయింది. ఘటనా స్థలంలో హత్యకు వినియోగించిన కత్తిని అధికారులు కనుగొన్నారు. హత్యకు ముందురోజే నిందితురాలు దాన్ని కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు.
బాలుడి మృతిలో తల్లి ప్రమేయం ఉందనే అనుమానంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆమె దోషిగా తేలితే గరిష్టంగా 26 ఏండ్ల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.