జర్నలిస్ట్ రోహిత్ శర్మకు శామ్ పిట్రోడా క్షమాపణ

న్యూయార్క్: కాంగ్రెస్​ నేతల దాడికి గురైన జర్నలిస్ట్ రోహిత్ శర్మకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా క్షమాపణలు చెప్పారు. ఇటీవల ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఈ దాడి జరిగింది.  దీంతో ఆదివారం శ్యామ్​ పిట్రోడా శర్మకు ఫోన్​ చేసి విచారం వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ఆమోదయోగ్యం కాదని.. అది దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా సెప్టెంబరు 7న టెక్సస్​రాష్ట్రంలోని డాలస్​లో మీటింగ్ నిర్వహించారు. దీన్ని కవర్ చేయడానికి రోహిత్ శర్మ అక్కడకు వెళ్లారు. 

ఈ సందర్భంగా శ్యామ్ పిట్రోడాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ అమెరికా చట్టసభ సభ్యులతో సమావేశం సందర్భంగా బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడుల అంశాన్ని లేవనెత్తారా  అని ప్రశ్నించారు. దీనిపై అక్కడే ఉన్న కాంగ్రెస్​ కార్యకర్తలు, రాహుల్​ అభిమానులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీనిపై రోహిత్​ శర్మకు ఫోన్ చేసి శ్యామ్ పిట్రోడా సారీ చెప్పారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తిస్తామన్నారు. వివాదాస్పదమైన ప్రశ్నలు అడుగుతున్నావని దాదాపు 15 మంది తనపై దాడికి పాల్పడ్డారని, ఒక గదిలో కొంతసేపు నిర్బంధించారని రోహిత్ శర్మ చెప్పారు.