‘ఐసీసీ టెస్ట్ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2024’.. అట్లుంటది బుమ్రాతోని..!

‘ఐసీసీ టెస్ట్ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2024’.. అట్లుంటది బుమ్రాతోని..!

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ‘ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024’కు ఎంపికై క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ అవార్డు దక్కించుకున్న తొలి బౌలర్ బుమ్రానే కావడం గమనార్హం. 2018లో చివరిగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దక్కిన ఈ గౌరవం మళ్లీ బుమ్రా రూపంలో టీమిండియాకు దక్కింది. 2024 టెస్ట్ క్రికెట్లో 14.92 యావరేజ్తో 71 వికెట్లు తీసి బుమ్రా సత్తా చాటడంతో ఈ అవార్డు దక్కింది.

సొంతగడ్డపై ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లపై టీమిండియా విజయం సాధించడంలో.. ఓవర్సీస్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో అద్భుతమైన బౌలింగ్తో రాణించి బుమ్రా శభాష్ అనిపించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర ఒత్తిడి ఉన్న సందర్భంలో కూడా ఐదు మ్యాచుల్లో 32 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా బుమ్రా నిలిచాడు. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెట్ బౌలర్ ర్యాంకింగ్స్లో కూడా బుమ్రానే నంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం.

ఇంగ్లండ్ క్రికెటర్స్ హ్యారీ బ్రూక్, జో రూట్ తో పాటు శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ ‘ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024’ కోసం పోటీ పడినప్పటికీ బుమ్రా అద్భుతమైన ఆట తీరుతో రాణించి, వీరిని అధిగమించి రికార్డు సృష్టించాడు.‘ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024’ దక్కడం పట్ల వరల్డ్ క్రికెట్లోనే దిగ్గజ బౌలర్ అయిన బుమ్రా హర్షం వ్యక్తం చేశాడు.

ALSO READ | Ian Chappell: ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా అవసరమా..? ఐసీసీకి ఆస్ట్రేలియా దిగ్గజం సూటి ప్రశ్న

ఈ అవార్డు కేవలం తన వ్యక్తిగత ప్రతిభ వల్ల మాత్రమే దక్కలేదని, తోటి క్రికెటర్లు, కోచ్లు అందించిన తోడ్పాటు, అభిమానుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని బుమ్రా తెలిపాడు. టెస్ట్ క్రికెట్ తన హృదయానికి ఎంతో దగ్గరైన ఫార్మాట్ అని, ఈ అవార్డ్ తనకెంతో ప్రత్యేకమైందని బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. ఇక.. టీమిండియా మహిళల జట్టుకు కూడా స్మృతి మందాన రూపంలో గౌరవం దక్కింది. ‘ఐసీసీ ఉమెన్స్ ఓడీఐ(ODI) క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా స్మృతి మందాన నిలిచింది.