
Gold News: చారిత్రాత్మకంగా భారతీయ కుటుంబాలకు బంగారానికి విడదీయలేని సంబంధం ఉంది. కుటుంబంలో ఏదైనా చిన్న శుభకార్యం జరిగినా లేక పండుగ వచ్చిన ముందుగా బంగారం కొనుగోలును శుభప్రదంగా భావిస్తుంటారు భారతీయులు. అందుకే తమకు ఉన్నంతలో కనీసం కాసైనా బంగారం కొంటుంటారు. పైగా ద్రవ్యోల్బణం సమయంలో డబ్బు విలువను కోల్పోతున్నందున విలువైన ఈ లోహంలోకి ప్రజలు తమ సంపదను మార్చుకుని స్టోర్ చేసుకోవటం వల్ల సేఫ్ హెవెన్ స్థానాన్ని పసిడి సంపాదించుకుంది.
ALSO READ | Gold Rate: ఉగాదికి ముందు బంగారం భారీ ర్యాలీ, తులానికి రూ.220 అప్.. తగ్గిన వెండి
పెళ్లిళ్లు, పేరంటాలు, సంబరాలు, సందళ్లు సందర్భం ఏదైనా గోల్డ్ కొనటం భారతీయ సంప్రదాయంలో భాగంగా ఉంది. నగరాల్లో కంటే గ్రామీణ ప్రజలు తమ తక్షల రుణ అవసరాలను తీర్చుకోవటానికి ఈ బంగారాన్ని ఉపయోగించుకుంటుంటారు. వ్యవసాయానికి అవసరమైన రుణాలను పొందటానికి బ్యాంకుల్లో తనఖా పెడుతుంటారు. అందుకే ప్రపంచంలో చైనా తర్వాత ఇండియా అతిపెద్ద పసిడి వినియోగదారుగా నిలిచింది.
10 దేశాల కంటే ఎక్కువ బంగారం..
ప్రస్తుతం అమెరికాకు చెందిన HSBC బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 10 సెంట్రల్ బ్యాంకుల కంటే ఎక్కువ బంగారాన్ని భారతీయ ప్రజలు కలిగి ఉన్నారని వెల్లడించింది. దీని ప్రకారం దాదాపు 25 వేల టన్నుల గోల్డ్ భారతీయ కుటుంబాల వద్ద ఉన్నట్లు తన తాజా అంచనాల్లో వెల్లడించింది. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విడ్జర్లాండ్, ఇండియా, జపాన్, తుర్కియా సెంట్రల్ బ్యాంకులు సంయుక్తంగా కలిగి ఉన్న పసిడి నిల్వల కంటే భారతీయ ప్రజల వద్ద ఎక్కువ బంగారం ఉందని నివేదిక వెల్లడించింది.
భారతీయ కుటుంబాలు ప్రైవేట్ బంగారం యాజమాన్యంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా ఇటీవలి సంవత్సరాల్లో తమ పసిడి నిల్వలను పెంచుకునేందుకు కొత్త కొనుగోళ్లను భారీగా పెంచాయి. ఆర్థిక అస్థిరతల సమయంలో వాటిని ఎదుర్కోవటానికి బంగారాన్ని రక్షణగా నిలుస్తుందని భావిస్తున్నందున అనేక సెంట్రల్ బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన గోల్డ్ నిల్వలను క్రమంగా పెంచుకుంది. ఇండియన్స్ పసిడిని కొనుగోలు చేస్తుండటం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.