
న్యూఢిల్లీ : యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్మరో బాంబు పేల్చారు. తమ దేశానికి వచ్చే ఫార్మా, సెమీకండక్టర్ల ఎగుమతులపై 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ విధించాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. స్టీల్, అల్యూమినియం వంటి ప్రొడక్టులపై భారీగా సుంకాలు విధిస్తామని ఇది వరకే అమెరికా పేర్కొంది. తాజా నిర్ణయంతో ఇండియా ఫార్మా రంగం టెన్షన్లో పడింది.
ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) ప్రకారం, చాలా భారతీయ జెనరిక్ ఫార్మా కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. మన ఎగుమతుల విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో 8.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 31 శాతం ఇవే ఉన్నాయి. ఇండియా ఫార్మా కంపెనీలు అమెరికాకు ఎక్కువగా జెనరిక్ మందులు అమ్ముతాయి.
ఖరీదైన మందులకు జెనరిక్ వెర్షన్తయారు చేయడం వల్ల ధరలు భారీగా తగ్గుతాయి. పేటెంట్లు లేని వాటిని జెనరిక్ మందులు అని పిలుస్తారు. 2022లో యూఎస్‌లో వాడిన అన్ని జెనరిక్ ప్రిస్క్రిప్షన్లలో దాదాపు సగం ఇండియా ఫార్మా కంపెనీలవే ఉన్నాయి. ట్రంప్ప్రకటనతో బుధవారం ఫార్మా స్టాక్స్ 2 శాతం వరకు నష్టపోయాయి. అమెరికా మార్కెట్లో ఇండియా ఫార్మా కంపెనీల వ్యాపారం ఎలా ఉందో చూద్దాం.
సన్ ఫార్మా
మనదేశంలో అతిపెద్ద ఫార్మా తయారీ సంస్థ సన్‌ఫార్మాకు 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 32 శాతం అమెరికా మార్కెట్ నుంచి వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలు విధిస్తే, భారాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుందని సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వి చెప్పారు. ఈ కంపెనీ 100 దేశాలకు మందులను ఎగుమతి చేస్తుంది. ఈ సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో విదేశీ అమ్మకాలు 72.7 శాతం ఉన్నాయి.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు ఉత్తర అమెరికా అతిపెద్ద మార్కెట్. 2024 ఆర్థిక సంవత్సరంలో దాని మొత్తం అమ్మకాలలో 47 శాతం వాటా ఇక్కడి నుంచే వచ్చింది. కంపెనీ ఈ ప్రాంతంలో అమ్మకాల కోసం ఆంకాలజీ, ఇమ్యునాలజీ జనరిక్ మందులపై ఆధారపడుతోంది. వీటి అమ్మకాలు గత సంవత్సరం కంటే 28 శాతం పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ యూఎస్‌లో రాబోయే కొన్ని సంవత్సరాలలోమరిన్ని కొత్త మందులను అమ్మనుంది.
సిప్లా
మనదేశంలో మూడవ అతిపెద్ద ఫార్మా తయారీ సంస్థ సిప్లా మొత్తం ఆదాయంలో 30 శాతం వరకు 2024లో ఉత్తర అమెరికా నుంచే సంపాదించింది. ఇది దానికి రెండవ అతిపెద్ద మార్కెట్. అమెరికాలో ప్రిస్క్రిప్షన్ మందులు, జెనరిక్ రెస్పిరేటరీ ఆంకాలజీ మందులను సరఫరా చేసే టాప్ 15 కంపెనీల్లో ఇదీ ఒకటి.
బయోకాన్
దీనికి గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్ నుంచి 44 శాతం ఆదాయం వచ్చింది. ఇది ప్రధానంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి రోగాలకు చికిత్స చేసే మందులను/బయోసిమిలర్లను అమెరికాకు అమ్ముతుంది. 2022లో అమెరికాకు సరఫరా అయిన బయోసిమిలర్లలో భారతీయ కంపెనీల వాటా 15 శాతం ఉంటుందని అంచనా.
లుపిన్
ఉత్తర అమెరికాలో అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సర మొత్తం అమ్మకాల విలువలో 37 శాతం ఉన్నాయి. శ్వాసకోశ, యాంటీ రెట్రోవైరల్ జెనరిక్ మందులకు ఉన్న డిమాండ్ కారణంగా మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ కంపెనీకి 30 శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది.
గ్లెన్‌మార్క్ ఫార్మా
కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో దాని రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన ఉత్తర అమెరికా నుంచి 26 శాతం ఆదాయం సంపాదించింది. కంపెనీ తన శ్వాసకోశ మందుల పోర్ట్‌ఫోలియోలను యూఎస్‌లో విస్తరించడంపై దృష్టి సారించింది.
జైడస్
జైడస్‌కు 2024లో దాని మొత్తం ఆదాయంలో 46 శాతం అమెరికా నుంచే వచ్చింది. కంపెనీకి యూఎస్ అతిపెద్ద మార్కెట్. జైడస్అక్కడి మార్కెట్లో 200 కంటే ఎక్కువ జెనరిక్ మందులను అమ్ముతుంది.