మరో ముగ్గురు భారతీయులకు కూడా పులిట్జర్ పురస్కారాలు
భారతీయ ఫొటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖికి రెండోసారి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. మరణానంతరం ఆయనకు ఫీచర్ ఫొటోగ్రఫీ కేటగిరీలో ఈ విశిష్ట గౌరవం దక్కడం విశేషం. డానిష్‌తో పాటు మరో ముగ్గురు భారతీయులకు కూడా ఈ గౌరవం దక్కింది. ఈ నలుగురికీ భారత్‌లో కొవిడ్ పరిస్థితుల మీద తీసిన ఫొటోలకే అవార్డులు దక్కడం మరో విశేషం. డానిష్ సిద్ధిఖితో పాటు అమిత్ దవే, అద్నన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టోలకు పురస్కారాలు ప్రకటించారు.
ఏడాది క్రితం అఫ్గానిస్థాన్ ప్రత్యేక దళాలు, తాలిబన్ల మధ్య జరిగిన కాల్పుల్లో విధి నిర్వహణలో ఉండగా తుటాలకు బలై రాయిటర్స్ సంస్థకు చెందిన ఫొటోగ్రాఫర్ డానిష్ సిద్ధిఖి కన్నుమూశారు. 2018లో మయన్మార్ లోని రోహింగ్యా శరణార్థుల సంక్షోభం మీద తీసిన ఫొటోలకు గానూ అద్నాన్ అబిదితో కలిసి తొలిసారి పులిట్జర్ అందుకున్నారు డానిష్ సిద్ధిఖి.
అంతేకాదు.. కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి సమయంలో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు సంబంధించిన సిద్ధిఖి తీసిన ఫొటోలు అప్పట్లో సంచలనంగా మారాయి. కరోనా సమయంలో ఆయన తీసిన ఎన్నో ఫొటోలు భారత్ లో మహమ్మారి పరిస్థితులను అద్దం పట్టడమే గాక.. ఎంతోమంది హృదయాలను కదిలించాయి.
మయన్మార్ సైన్యం దాడులు భరించలేక రోహింగ్యా శరణార్థులు బోట్లలో బంగ్లాదేశ్ లోకి తరలివచ్చిన సమయంలో ఓ మహిళ.. అక్కడి భూమిని చేతితో తాకుతున్నప్పుడు సిద్ధిఖి తీసిన ఫొటో ఇది. ఈ ఫొటో ప్రపంచాన్ని కదిలించడంతో సిద్ధిఖికి పులిట్జర్ అవార్డు దక్కింది.
ఎకానమిక్స్, మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసిన సిద్ధిఖి మొదట్లో పలు టీవీ చానళ్లలో కరస్పాండెంట్ గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2010లో రాయిటర్స్ సంస్థలో ఫొటో జర్నలిస్టుగా చేరారు. ఆ సంస్థ తరపున దేశ, విదేశాల్లో అనేక సంచలన వార్తలను కవర్ చేశారు.
అఫ్గానిస్థాన్ లోని కాందహార్ లో గల స్పిన్ బోల్డక్ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు, అఫ్గాన్ బలగాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆ వార్తలను కవర్ చేసేందుకు సిద్ధిఖి.. అప్గాన్ దళాలతో కలిసి అక్కడకు వెళ్లారు. ఈ ఘర్షణలను కవర్ చేసే సమయంలో కొద్దీగా విరామం దొరకడంతో అక్కడ ఉన్న పచ్చికపైనే విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో తీసుకున్న ఫొటోనే ఆయన తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అదే ఆయన చివరి విశ్రాంతి అయ్యింది. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో సిద్ధిఖి మృతిచెందారు.
మరిన్ని వార్తల కోసం..
నారాయణను చిత్తూరుకు తరలించిన పోలీసులు