Team India: ఫలిస్తున్న బీసీసీఐ చర్యలు.. రంజీ బాట పట్టిన స్టార్ క్రికెటర్లు

న్యూఢిల్లీ: టెస్టుల్లో నిరాశపరుస్తున్న టీమిండియా సూపర్‌‌ స్టార్లు ఫామ్‌‌ కోసం రంజీ బాట పడుతున్నారు. ఈ నెల23 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ చివరి దశ గ్రూప్‌‌ స్టేజ్‌‌ మ్యాచ్‌‌లకు అందుబాటులో ఉండేందుకు రెడీ అవుతున్నారు. వికెట్‌‌ కీపర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ ఇప్పటికే ఢిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు ఓకే చెప్పగా, విరాట్‌‌ కోహ్లీ నుంచి ఇంకా గ్రీన్‌‌ సిగ్నల్‌‌ రాలేదు. 

‘పంత్‌‌ అందుబాటులో ఉంటానని చెప్పాడు. కాకపోతే విరాట్‌‌ కూడా ఆడాలని మేం కోరుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్‌‌ రాలేదు’ అని ఢిల్లీ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ తెలిపింది. టీమిండియా కెప్టెన్‌‌ రోహిత్‌‌ మంగళవారం కెప్టెన్‌‌ రహానెతో కలిసి ప్రాక్టీస్‌‌ చేశాడు. కానీ రెండో రోజు మళ్లీ గ్రౌండ్‌‌లో కనిపించలేదు. జమ్మూ కశ్మీర్‌‌తో ముంబై ఆడే మ్యాచ్‌‌లో పాల్గొనడంపై రోహిత్‌‌తో ఇంకా అధికారికంగా చర్చించలేదని ఎంసీఏ అధికారులు తెలిపారు. ఇక, ముంబై శిబిరంలో చేరిన యశస్వి జైస్వాల్‌‌ ప్రాక్టీస్‌‌ చేశాడు. గిల్‌‌ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగేందుకు రెడీ  అవుతున్నాడు.