పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో క్రీడలు వద్దు.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ప్లేయర్లు

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో క్రీడలు వద్దు.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ప్లేయర్లు

న్యూఢిల్లీ: పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడిని ఇండియా క్రీడాకారులు ముక్త కంఠంతో ఖండించారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో అన్ని క్రీడా సంబంధాలను తెంచుకోవాలని కొంత మంది ప్లేయర్లు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సచిన్‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ సంతాపం వ్యక్తం చేశారు. ‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ చీకటి సమయంలో ఇండియా, వరల్డ్‌‌‌‌‌‌‌‌ వాళ్లతో ఐక్యంగా ఉన్నాయి. జరిగిన ప్రాణ నష్టానికి సంతాపం తెలియజేస్తున్నాం. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో న్యాయం కోసం కూడా పోరాడాలి’ అని సచిన్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. 

‘బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం. ప్రాణాలు కోల్పోయిన వారందరికీ శాంతి, బలం చేకూరాలని కోరుకుంటున్నా. వారిపై జరిగిన క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’ అని కోహ్లీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. పేసర్‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు. ‘ఏ కారణం, ఏ నమ్మకం, ఏ భావజాలం ఇలాంటి క్రూరమైన చర్యను సమర్థించలేవు. మానవ జీవితానికి విలువ లేని ఈ పోరాటం ఏమిటి. ఈ పిచ్చి త్వరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నా. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కనిపెట్టి దయ లేకుండా శిక్షించాలని కోరుతున్నా’ అని సిరాజ్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు.

 ‘మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. దీనికి కారణమైన వాళ్లు పరిహారం చెల్లించక తప్పదు’ అని టీమిండియా చీఫ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. పాక్‌‌‌‌‌‌‌‌తో అన్ని క్రీడా సంబంధాలను తెంచుకోవాలని మాజీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ శ్రీవత్స్‌‌‌‌‌‌‌‌ గోస్వామి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. క్రికెట్‌‌‌‌‌‌‌‌తో పాటు అన్నింటికి దీన్ని వర్తింపజేయాలన్నాడు. ఈ క్రూరమైన దాడికి కఠిన చర్యలు తీసుకోవాలని బాక్సర్‌‌‌‌‌‌‌‌ విజేందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చాడు.

  "పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం జరగాలి. ఏ కారణం కూడా ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. వెనుకబడి ఉన్న కుటుంబాలకు -మీ దుఃఖం మాటల్లో చెప్పలేనిది, కానీ మీరు ఒంటరిగా లేరు. మేము మీతో ఉన్నాము. ఈ చీకటి క్షణాల్లో మనం ఒకరినొకరు బలపరుచుకుందాం. శాంతి తిరిగి వస్తుందనే ఆశను ఎప్పటికీ వదులుకోవద్దు’ అని పీవీ సింధు పేర్కొంది.