
న్యూఢిల్లీ: ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జూలు విదిల్చింది. సునీల్ నరైన్ ( 27; 3/29) ఆల్‌రౌండ్ షోకు తోడు అంగ్‌క్రిష్ రఘువంశీ (32 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), రింకూ సింగ్ (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 36), వరుణ్ చక్రవర్తి (2/39) సత్తా చాటడంతో మంగళవారం రాత్రి చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 14 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెక్ పెట్టింది.
తొలుత టాస్ ఓడిన కోల్‌కతా 20 ఓవర్లలో 204/9 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ఢిల్లీ 20 ఓవర్లలో 190/9 స్కోరుకే పరిమితమై ఓడిపోయింది. డుప్లెసిస్ (45 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), అక్షర్ పటేల్ (23 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), విప్రజ్ నిగమ్ (19 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) పోరాడినా ఫలితం లేకపోయింది. నరైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
‘టాప్’ లేపారు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్(26), నరైన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌లో గుర్బాజ్ రెండు ఫోర్లు బాదితే, తర్వాత నరైన్ 6, 4, 6తో జోరు పెంచాడు. ఆ వెంటనే గుర్బాజ్ 4, 4, 4, 6 బాదినా మూడో ఓవర్‌లో స్టార్క్ (3/43)కు వికెట్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 48 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వన్‌డౌన్‌లో రహానె కూడా జోరు తగ్గనీయలేదు.
స్టార్క్, ముకేశ్‌ను టార్గెట్ చేసి 6, 4, 4, 4 కొట్టడంతో పవర్‌ప్లేలో కేకేఆర్ 79/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత స్పిన్నర్లు విప్రజ్ నిగమ్ (2/41), అక్షర్ పటేల్ (2/27) కోల్‌కతా దూకుడుకు అడ్డుకట్ట వేశారు. ఐదు బాల్స్ తేడాలో నరైన్, రహానె (26)ను పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 37 రన్స్ జతయ్యాయి. ఈ దశలో రఘువంశీ సిక్సర్లతో రెచ్చిపోవడంతో 8.4 ఓవర్లలో స్కోరు 100కు చేరింది.
రెండో ఎండ్‌లో వెంకటేశ్ అయ్యర్ (7)ను 10వ ఓవర్‌లో అక్షర్ దెబ్బకొట్టాడు. 17 బాల్స్ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో ఫస్ట్ టెన్‌లో కేకేఆర్ స్కోరు 110/4గా మారింది. ఇక రఘువంశీతో కలిసి రింకూ సింగ్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేయడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 25 రన్సే వచ్చాయి. 15వ ఓవర్‌లో రింకూ 4, 6, 4తో బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు 159/4కు చేరింది.
16వ ఓవర్‌లో 9 రన్సే రావడంతో ఒత్తిడికి లోనైన రఘువంశీ తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి చమీరా (1/46)కు వికెట్ ఇచ్చాడు. ఐదో వికెట్‌కు 61 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఐదు బాల్స్ తర్వాత రింకూ కూడా ఔట్ కావడంతో 17.3 ఓవర్లలో స్కోరు 177/6గా మారింది. చివర్లో రసెల్ (17), పావెల్ (5) హిట్టింగ్‌కు దిగినా స్టార్క్ కట్టడి చేశాడు. లాస్ట్ ఓవర్‌లో వీరిద్దరితో పాటు అనుకూల్ రాయ్ (0) వికెట్లు తీశాడు. అయినప్పటికీ స్కోరు రెండొందలు దాటింది.
పోరాటం సరిపోలే..
ఛేజింగ్‌లో ఢిల్లీకి మెరుగైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ డుప్లెసిస్, చివర్లో విప్రజ్ నిగమ్ అద్భుతంగా పోరాడినా ప్రయోజనం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే అభిషేక్ పోరెల్ (4) ఔటైనా, డుప్లెసిస్ 6, 4, 4తో టచ్‌లోకి వచ్చాడు. రెండు ఫోర్లతో గాడిలో పడినట్లు కనిపించిన కరుణ్ నాయర్ (15)ను ఐదో ఓవర్‌లో వైభవ్ అరోరా (1/19) ఎల్బీ చేశాడు.
58/2తో ఉన్న ఢిల్లీకి ఏడో ఓవర్‌లో కేఎల్ రాహుల్ (7) రనౌట్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో స్కోరు 60/3గా మారింది. అక్షర్ పటేల్‌తో కలిసి డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. 9వ ఓవర్‌లో 4, 4, 6తో 31 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అక్షర్ కూడా సిక్స్‌తో టచ్‌లోకి రావడంతో ఫస్ట్ టెన్‌లో డీసీ 97/3తో నిలిచింది. చేయాల్సిన రన్స్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి అక్షర్, డుప్లెసిస్ బ్యాట్లు ఝుళిపించే ప్రయత్నం చేశారు.
అయితే నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో జోరు పెంచిన అక్షర్‌ను 14వ ఓవర్‌లో ఔట్ చేసిన నరైన్ లాస్ట్ బాల్‌కు ట్రిస్టాన్ స్టబ్స్ (0) వికెట్ తీసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో వికెట్‌కు 76 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగియడంతో డీసీ 138/5తో ఎదురీత మొదలుపెట్టింది. 15 ఓవర్లలో 146/5తో నిలిచిన డీసీని 16వ ఓవర్‌లో నరైన్ మళ్లీ దెబ్బకొట్టాడు. డుప్లెసిస్ వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
ఇక గెలవడానికి 28 బాల్స్‌లో 59 రన్స్ చేయాల్సిన దశలో విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ (7) 4, 6తో ఆశలు రేకెత్తించారు. కానీ 18వ ఓవర్‌లో వరుణ్ వరుస బాల్స్‌లో అశుతోష్, స్టార్క్ (0)ను ఔట్ చేసినా నిగమ్ సిక్స్‌తో విజయ సమీకరణం 12 బాల్స్‌లో 38గా మారింది. 19వ ఓవర్‌లో నిగమ్ 4, 6 బాదాడు. కానీ లాస్ట్ ఓవర్‌లో 25 రన్స్‌కు నిగమ్ 4, 4 కొట్టి ఔట్‌కావడంతో డీసీకి పరాజయం తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 20 ఓవర్లలో 204/9 (రఘువంశీ 44, రింకూ 36, స్టార్క్ 3/43, అక్షర్ పటేల్ 2/27). ఢిల్లీ: 20 ఓవర్లలో 190/9 (డుప్లెసిస్ 62, అక్షర్ 43, నిగమ్ 38, నరైన్ 3/29).