
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాల రాజీనామాలను రైల్వే శాఖ ఆమోదించింది. ఈ ఇద్దరు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉద్యోగాల నుంచి అధికారికంగా రిలీవ్ కావాల్సి ఉండటంతో వీరు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించినట్లు రైల్వేశాఖ సోమవారం(సెప్టెంబర్ 09) తెలిపింది.
రాజీనామాకు ముందు ఇవ్వాల్సిన మూడు నెలల నోటీస్ పీరియడ్‌ను రైల్వేశాఖ సడలించింది. ప్రభుత్వ ఉద్యోగులైనందున షోకాజ్ నోటీసు సర్వీస్ నార్మ్‌లో భాగమని పేర్కొంది.
Also Read :- ఆ విషయంలో రూట్ కంటే కోహ్లీనే ఉత్తమ ఎంపిక
అక్టోబర్ 5న పోలింగ్
90 మంది సభ్యులు గల హర్యానా శాసనసభకు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు పోటీపడనున్నారు. జులనా నియోజకవర్గం నుంచి ఫోగట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
కాగా, ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో.. వినేశ్ ఫోగాట్ అనర్హత వేటుకు గురైన విషయం విదితమే. మహిళలు 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో పోటీ పడిన ఆమె ఉండాల్సిన దాని కంటే100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా ఫైనల్ కు ముందు అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఆమె రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు.