దివాళీ జర్నీ : 200 స్పెషల్ రైళ్లను ప్రారంభించిన రైల్వే శాఖ

దివాళీ జర్నీ : 200 స్పెషల్ రైళ్లను ప్రారంభించిన రైల్వే శాఖ

దేశవ్యాప్తంగా దివాళీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైనందున, దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి చూస్తున్నారు. దీనివల్ల రైల్వే స్టేషన్‌లలో భారీగా రద్దీ పెరిగింది. పండగకు తమ సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వేస్ తీపికబురు చెప్పింది. ప్రయాణీకుల రద్దీని పరిష్కరించడానికి భారతీయ రైల్వే 200 కొత్త రైళ్లను ప్రకటించింది. 

ఈ రైళ్లు ఆనంద్ విహార్, న్యూఢిల్లీ, పాట్నా, అహ్మదాబాద్, లక్నో, రోహ్‌తక్, పూణే మరియు LTT వంటి ప్రధాన రైల్వే స్టేషన్‌ల గుండా వెళ్లనున్నాయి. దీంతోపాటు పండుగ సీజన్లో ప్రయాణించే వారి కోసం అక్టోబర్ 29న స్పెషల్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు. దీపావాళీ, ఛత్ పూజ పండుగ సీజన్ లో ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా మొత్తం 7వేల స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ రైళ్లతో రోజుకు రెండు లక్షల మంది ప్రయాణికులు అదనంగా రాకపోకలు సాగించే అవకాశం ఉందన్నారు ఆయన.

2023లో ఇదే సమయంలోనే 4,500 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది సర్వీసులను పెంచాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.