రైల్వే స్టేషన్లలో ఏఐతో రష్ కంట్రోల్

రైల్వే స్టేషన్లలో ఏఐతో రష్ కంట్రోల్
  • కలర్​ కోడ్​తో ఎన్​క్లోజర్లు, పబ్లిక్​ మూమెంట్ కోసం రూట్స్
  • రద్దీ నియంత్రణపై ప్రయాణికులు, కూలీలు, దుకాణాదారుల అభిప్రాయాల సేకరణ
  • న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటనతో రైల్వే శాఖ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.. 18 మంది దుర్మరణం నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో పబ్లిక్​రష్​ను కంట్రోల్ చేసేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందకు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగించనున్నన్నారు. ముఖ్యంగా రైళ్ల ఆలస్యం సమయంలో జనసమూహ కదలికలను పర్యవేక్షించడానికి ఏఐ టెక్నాలజీని వాడనున్నట్లు రైల్వే అధికార వర్గాలు చెప్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అత్యధిక రద్దీ ఉండే 60 రైల్వే స్టేషన్లలో పర్మినెంట్​గా హోల్డింగ్ జోన్స్ ఏర్పాటు చేయనున్నారు. రోజు రష్​ఉండే.. ప్రత్యేక సందర్భాలు, కార్యక్రమాల సమయంలో రద్దీ మరింత పెరిగే స్టేషన్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. 

ఆయా స్టేషన్లలో ఈ హోల్డింగ్​జోన్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రిస్తారు. స్టేషన్​లో ప్రయాణికులు ఈ జోన్ల నుంచి రైళ్లు ఎక్కేందుకు ప్లాట్​ఫామ్​లపైకి వెళ్లేందుకు, బయటకు వెళ్లేందుకు కలర్​కోడ్​తో ఎన్​క్లోజర్లు, రూట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా స్టేషన్లలో పబ్లిక్ రష్​ను అనుసరించి ఏఐ సాయంతో ఈ హోల్డింగ్​జోన్లు, ఎన్​క్లోజర్ల ద్వారా నియంత్రించాలని యోచిస్తున్నారు. అలాగే రద్దీకి సంబంధించిన సమస్యలను గుర్తించడానికి ప్రయాణికులు, కూలీలు, స్టేషన్లలోని దుకాణదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. 

కుంభమేళా కోసం వస్తున్న ప్రయాణికుల సంఖ్య ప్రయాగ్​రాజ్​కు 300 కిలోమీటర్ల పరిధిలోని నాలుగు రాష్ట్రాల నుంచి అధికంగా ఉందని గుర్తించారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా 35 రైల్వేస్టేషన్లకు ప్రయాణికులు తాకిడి ఎక్కువ ఉంది. ప్రత్యేకంగా ‘‘సెంట్రలైజ్డ్​వార్​రూమ్” ఏర్పాటు చేసి రియల్​టైమ్ మానిటరింగ్​తో ఆయా స్టేషన్లల్లో రద్దీని నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.

న్యూఢిల్లీలోని స్టేషన్లలో క్విక్​ రెస్పాన్స్​ టీమ్స్ 

తొక్కిసలాట జరిగిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్​లో గట్టి భద్రతాచర్యలు చేపట్టారు. ఆర్పీఎఫ్​సిబ్బందితోపాటు జీఆర్పీ పోలీసులను కూడా స్టేషన్​లో నియమించామని.. క్విక్​రెస్పాన్స్​టీమ్స్ అందుబాటులో ఉంచారు. ‘‘ఎటువంటి కారణం లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి ఉండటం, నిలబడటం మేం గమనించాం. దీనివల్ల ఇతర ప్రయాణికులు వేర్వేరు ప్లాట్‌‌ఫామ్‌‌లకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురై ఆలస్యం జరిగింది. 

ఇక నుంచి సరైన కారణం లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నిలబడటానికి ఎవరీని అనుమతించం” అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. బారికేడ్లు కూడా ఏర్పాటు చేశామని.. స్టేషన్​లో పోలీస్ పెట్రోలింగ్​పెట్టినట్టు చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పబ్లిక్​రష్​ను గమనిస్తూ.. రద్దీ నియంత్రనకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఢిల్లీలోని అన్ని రైల్వే స్టేషన్లలో కుంభమేలా రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిలో కూడా అధికారులు ఇదే రకమైన ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు. ఇందుకోసం అన్ని స్టేషన్లలో కలిపి అదనంగా 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఆ రోజు 1500 జనరల్​ టికెట్లు సేల్​

ఢిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగిన రోజు 1,500 జనరల్ టికెట్టు అమ్మినట్టు అధికారులు గుర్తించారు. అలాగే, పెద్ద సంఖ్యలో ప్లాట్ ఫామ్ టికెట్లు కూడా విక్రయించారు. దీంతో స్టేషన్​లో రద్దీ విపరీతంగా పెరిగిపో యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని స్టేషన్లలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్లాట్​ఫామ్​ టికెట్ల అమ్మకాలను నిలిపివే యనున్నట్టు అధికారులు తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు మినహా యింపు ఇచ్చినట్టు వివరించారు.