స్పెషల్‌‌ ట్రైన్లలో సమ్మర్‌‌ టూర్లు.. నాలుగు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిన ఐఆర్‌‌సీటీసీ

స్పెషల్‌‌ ట్రైన్లలో సమ్మర్‌‌ టూర్లు..  నాలుగు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిన ఐఆర్‌‌సీటీసీ
  • ఈ నెల 23 నుంచి జూన్‌‌ 11 వరకు సాగనున్న యాత్ర
  • ఒక్కో టూర్​ ఎనిమిది నుంచి పది రోజులు 
  • ట్రావెలింగ్, లాడ్జింగ్, బోర్డింగ్‌‌ ఖర్చులన్నీ ప్యాకేజీలోనే...

మంచిర్యాల, వెలుగు : వేసవి సెలవుల్లో టూర్లకు వెళ్లాలనుకునే వారి కోసం ఇండియన్‌‌ రైల్వే కేటరింగ్‌‌ అండ్‌‌ టూరిజం కార్పొరేషన్‌‌ (ఐఆర్​సీటీసీ) భారత్‌‌ గౌరవ్‌‌ పేరుతో ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేసింది. హరిద్వార్, రిషికేశ్, కాశీ, అయోధ్య, అరుణాచలం, ఉజ్జయిని, పూరీ వంటి ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత టెంపుల్స్‌‌, టూరిజం డెస్టినేషన్స్‌‌ను కవర్‌‌ చేస్తూ నాలుగు ప్యాకేజీలను ప్రకటించింది. ఈ నెల 23 నుంచి జూన్‌‌ 11 వరకు నాలుగు విడతల్లో ఈ టూర్లను ఆఫర్‌‌ చేస్తోంది. 

ఒక్కో టూర్‌‌ 8 నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. ప్యాకేజీ రేట్లను ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్​ కేటగిరీలుగా విభజించగా.. రూ.18 వేల నుంచి రూ.40 వేల వరకు అందుబాటులో ఉంచింది. ఒక్కో కోచ్‌‌లో 70 మంది చొప్పున మొత్తం 700 మంది టూరిస్ట్‌‌లను తీసుకెళ్లనున్నారు. ఉదయం టీ, బ్రేక్‌‌ఫాస్ట్‌‌ నుంచి మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌‌తో పాటు ప్యాకేజీలను బట్టి ఏసీ, నాన్‌‌ ఏసీ లాడ్జింగ్‌‌ సౌకర్యం కల్పించనున్నారు. 

ట్రావెలింగ్‌‌, లాడ్జింగ్‌‌, బోర్డింగ్‌‌ వంటి చార్జీలు కూడా ప్యాకేజీలోనే కలిపి ఉంటాయి. టూరిస్ట్‌‌ల భద్రత కోసం కోచ్‌‌లలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఎమర్జెన్సీ మెడికల్‌‌ ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు ఐఆర్‌‌సీటీసీ మానిటర్‌‌ ప్రశాంత్, కిరణ్‌‌ తెలిపారు. మరిన్ని వివరాలకు 040-27702407, 97013 60701, 92810 30711, 92810 30712, 92810 30749, 92810 30750 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ప్యాకేజీ 1 (గురుకృప యాత్ర) 

ఈ ప్యాకేజీలో హరిద్వార్‌‌ (మానసాదేవి టెంపుల్, గంగా హారతి), రిషికేశ్‌‌ (రామ్‌‌ఝులా, లక్ష్మణ్‌‌ ఝులా), వైష్ణోదేవి టెంపుల్, అమృత్‌‌సర్‌‌ గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్‌‌, ఆనంద్‌‌పూర్‌‌ సాహిబ్‌‌ గురుద్వారా, నైనాదేవి టెంపుల్‌‌ ఉండనున్నారు. ఈ నెల 23 నుంచి మే 2 వరకు (9 నైట్స్, 10 డేస్)ఈ యాత్ర కొనసాగనుంది. ఈ స్పెషల్‌‌ ట్రైన్‌‌ విజయవాడలో మొదలై నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్‌‌కాగజ్‌‌నగర్‌‌ మీదుగా వెళ్లనుంది. స్లీపర్‌‌కోచ్‌‌ (ఎకానమీ)లో పెద్దలకు రూ.18,510, పిల్లలకు రూ.17,390, థర్డ్‌‌ ఏసీ (స్టాండర్డ్‌‌)లో పెద్దలకు రూ.30,730, పిల్లలకు రూ.29,420, సెకండ్‌‌ ఏసీ (కంఫర్ట్‌‌)లో పెద్దలకు రూ.40,685, పిల్లలకు రూ.39,110గా రేటు నిర్ణయించారు.

ప్యాకేజీ 2 (సరస్వతీ పుష్కరాల స్పెషల్)

ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ్‌‌ టెంపుల్‌‌, కోణార్క్‌‌ ఆలయం, గయ విష్ణుపాధ్‌‌ టెంపుల్‌‌, కాశీలో కాశీ విశ్వనాథ్‌‌, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలు, గంగాహారతి, అయోధ్య రామాలయం, ప్రయాగ్‌‌రాజ్‌‌ త్రివేణి సంగమం ప్లేస్‌‌లు ఉండనున్నాయి. మే 8 నుంచి 17 వరకు (9 నైట్స్, 10 డేస్) ఈ యాత్ర సాగనుంది. ఈ ట్రైన్‌‌ సికింద్రాబాద్‌‌లో స్టార్ట్‌‌ అయి భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా వెళ్లనుంది. స్లీపర్‌‌కోచ్‌‌లో పెద్దలకు రూ.16,800, పిల్లలకు రూ.15,700, థర్డ్‌‌ ఏసీలో పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ.25,300, సెకండ్‌‌ ఏసీలో పెద్దలకు రూ.34,900, పిల్లలకు రూ.33,300గా నిర్ణయించారు.

ప్యాకేజీ 3 (దివ్య దక్షిణ్​యాత్ర) 

ఈ యాత్ర తిరువణ్ణమలైలో అరుణాచలం టెంపుల్, రామేశ్వరం రామనాథస్వామిఆలయం, మధురై మీనాక్షి టెంపుల్, కన్యాకుమారిలో రాక్‌‌ మెమోరియల్‌‌, కుమారి అమ్మన్‌‌ టెంపుల్‌‌, త్రివేండ్రంలో శ్రీపద్మనాభస్వామి ఆలయం, ట్రిచీలో శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావూరు బృహదీశ్వరాలయం వరకు మే 22 నుంచి 30 వరకు (8 నైట్స్, 9 డేస్) యాత్ర సాగనుంది. 

సికింద్రాబాద్‌‌లో స్టార్ట్‌‌ అయ్యే ఈ ట్రైన్‌‌ భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా వెళ్లనుంది. స్లీపర్‌‌ కోచ్‌‌లో పెద్దలకు రూ.14,700, పిల్లలకు రూ.13,700, థర్డ్‌‌ ఏసీలో పెద్దలకు రూ.22,900, పిల్లలకు రూ.21,700, సెకండ్‌‌ ఏసీలో పెద్దలకు రూ.29,900, పిల్లలకు రూ.28,400గా ధర నిర్ణయించారు.

ప్యాకేజీ 4 (జ్యోతిర్లింగ దర్శన్‌‌)

ఈ యాత్ర ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగ్‌‌పూర్‌‌లో దీక్షభూమి స్తూపం, శ్రీస్వామినారాయణ్‌‌ మందిర్‌‌, నాసిక్‌‌లో త్రయంబకేశ్వర్, పూణేలో భీమశంకర్‌‌ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌‌లో ఘృష్ణేశ్వర టెంపుల్‌‌, మోవ్‌‌లో అంబేద్కర్‌‌ పుట్టిన ప్రాంతం వరకు జూన్‌‌ 3 నుంచి 11 వరకు (8 నైట్స్, 9డేస్‌‌) యాత్ర సాగుతుంది. 

ఈ ట్రైన్‌‌ సికింద్రాబాద్‌‌లో మొదలై కామారెడ్డి, నిజామాబాద్‌‌ మీదుగా వెళ్తుంది. స్లీపర్‌‌ కోచ్‌‌లో పెద్దలకు రూ.14,700, పిల్లలకు రూ.13,700, థర్డ్‌‌ ఏసీలో పెద్దలకు రూ.22,900, పిల్లలకు రూ.21,700, సెకండ్‌‌ ఏసీలో పెద్దలకు రూ.29,900, పిల్లలకు రూ.28,400గా 
నిర్ణయించారు.