ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే 2030 నాటికి నికర శూన్య కార్బన్ ఉద్గారిణిగా మారాలని భారత్ పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా త్వరలోనే తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మేరకు దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తున్నది. 2025 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 35 హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు సంబంధించిన ట్రయల్‌రన్స్ డిసెంబర్లో నిర్వహించనున్నది.
హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్‌తో రసాయన చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా నీరు, ఆవిరి మాత్రమే వెలువడుతాయి. అవసరమైన ప్రక్రియల కోసం రైలు గంటకు సుమారు 40 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. నీటి నిల్వ కోసం రైలులో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ హైడ్రోజన్ రైలు గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని శబ్దం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ బిగింపు, ఇతర సౌకర్యాల ఏర్పాటుపై రైల్వే శాఖ దృష్టి సారించనున్నది. ఒక్కో రైలుకు సమారుగా రూ.80కోట్లు ఖర్చు అవుతుంది. డీజిల్, కరెంట్ కాకుండా నీటితో నడవడంతో ఈ హైడ్రోజన్ రైలుతో పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు.