బ్లడ్​బ్యాంక్​లో .. నిండుకున్నరక్త నిల్వలు

  • రోజుకు 30, నెలకు వెయ్యి యూనిట్లు అవసరం 
  •  రక్తం దొరక్క తలసేమియా, సికిల్​సెల్ ​బాధితులు, పేషెంట్ల అవస్థలు  
  • శిబిరాల నిర్వహణకు దాతలు ముందుకు రావాలి  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లోని ఇండియన్​ రెడ్ ​క్రాస్ ​బ్లడ్​ బ్యాంక్​లో రక్త నిల్వలు నిండుకున్నాయి. దీంతో తలసేమియా, సికిల్​సెల్​ బాధితులతో పాటు హాస్పిటల్​కు వచ్చే గర్భిణులు, డయాలసిస్, ఇతర పేషెంట్లు రక్తం దొరక్క ప్రాణాపాయ స్థితిలో అల్లాడుతున్నారు. ఇటీవల వైరల్ ఫీవర్స్, డెంగీ తీవ్రత పెరిగింది. ప్లేట్​లెట్స్​తగ్గి పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. తలసేమియా, సికిల్​సెల్​ బాధితులతో పాటు ఇతర పేషెంట్లకు రోజుకు కనీసం 30 యూనిట్లు, నెలకు 900 నుంచి వెయ్యి యూనిట్ల బ్లడ్​అవసరమవుతుంది. ఈ రక్తాన్ని రెడ్​క్రాస్​ బ్లడ్​బ్యాంక్​ ద్వారా ఉచితంగానే అందజేస్తున్నారు. 

దొరకని యూనిట్లు

అయితే, గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​లో ప్రస్తుతం అన్ని గ్రూపులు కలిపి బుధవారం నాటికి 40 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఓ పాజిటివ్​, ఏ పాజిటివ్, బీ పాజిటివ్ ​గ్రూపులు మినహా ఇతర గ్రూపుల రక్త నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. కొద్ది రోజులుగా రక్తదాన శిబిరాలు లేకపోవడం, దాతలు ముందుకు రాకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో ప్రైవేట్​బ్లడ్​బ్యాంకుల్లో కొనాలంటే ఒక్కో యూనిట్​కు రూ.1500 ఖర్చవుతుంది. గవర్నమెంట్​ హాస్పిటల్​కు వచ్చేవారంతా నిరుపేదలే కావడంతో ప్రైవేట్​లో కొనలేకపోతున్నారు. అంతేగాకుండా రెండు మూడు యూనిట్లు అవసరమైతే ప్రైవేట్​లో కూడా దొరకడం లేదు. ముఖ్యంగా తలసేమియా బాధితుల పాట్లు అంతాఇంకా కావు.  

రక్తదాన శిబిరాలకు ముందుకు రావాలి

 ప్రస్తుత ఆపత్కాల సమయంలో రక్తదాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, ప్రైవేట్​సంస్థల నిర్వాహకులు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఐఆర్ సీఎస్​ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్​ ఇన్​చార్జ్​ మధుసూదన్​రెడ్డి, జిల్లా చైర్మన్ ​భాస్కర్ ​రెడ్డి, తలసేమియా, సికిల్​సెల్​ బాధితుల సంఘం ప్రతినిధి కాసర్ల రంజిత్ ​విజ్ఞప్తి చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించేవారు బ్లడ్​ బ్యాంక్​లో సంప్రదిస్తే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొంటున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, తలసేమియా, సికిల్​సెల్​ బాధితులు, పేషెంట్ల ప్రాణాలను కాపాడేందుకు దాతలు స్పందించాలని వారు కోరారు.  

బ్లడ్​బ్యాంక్​లో ఉన్న యూనిట్లు  
ఓ పాజిటివ్​–14, ఓ నెగటివ్–0
ఏ పాజిటివ్​–11, నెగటివ్–02
బీ పాజిటివ్–12, నెగటివ్–0
ఏబీ పాజిటివ్–01, నెగటివ్–​0