
న్యూఢిల్లీ: అమెరికా నుంచి బహిష్కరణకు గురై.. పనామాలోని ఓ హోటల్‌కు చేరిన ఇండియన్లు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వచ్చిన వార్తలపై పనామాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అమెరికా నుంచి ఇండియన్లు పనామాకు సురక్షితంగా చేరుకున్నారని..అక్కడి హోటల్‌లో వారు సేఫ్ గా, సెక్యూర్ గా ఉన్నారని తెలిపింది. అందరికీ అన్ని సౌలతులు సమకూర్చినట్లు వెల్లడించింది.
ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని.. పనామా అధికారులతో కలిసి పని చేస్తున్నామని భారత కాన్సులేట్ 'ఎక్స్' వేదికగా పేర్కొంది. ట్రంప్ ఆదేశాల మేరకు ఇండియా, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ , చైనా దేశాలకు చెందిన 300మందిని అమెరికా బహిష్కరించింది. వారిని వారి సొంత దేశాలకు పంపడానికి పనామాను రవాణా కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ 300 మందిని పనామాలోని ఒక హోటల్‌లో తాత్కాలికంగా ఉంచారు.
అయితే, వీరంతా ఇటీవల "మాకు సహాయం చేయండి", "మేం మా దేశంలో సురక్షితంగా ఉండలేము" అని రాసి ఉన్న ప్లకార్డులను హోటల్ కిటికీల నుంచి చూపిస్తూ సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. దాంతో బహిష్కరణకు గురైన వారిని హోటల్‌లో బలవంతంగా నిర్బంధించారంటూ వార్తలు వెలువడ్డాయి. దాంతో పనామా ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.
దీనిపై పనామా సర్కార్ స్పందిస్తూ..వలవవాదులను నిర్బంధించారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. వలసదారులను ఉంచుతున్న హోటల్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఉందని వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా భారత ఎంబసీ కూడా స్పందించింది. వలసదారుల శ్రేయస్సే తమకు ముఖ్యమని.. అందుకు పనామా అధికారులతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేసింది.