న్యూఢిల్లీ : ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో ఇండియా షూటర్ అఖిల్ షెరోన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో అఖిల్ 452.6 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. పెనీ ఇస్తవాన్ (హంగేరి, 465.3), ప్రివాట్సి జిరి (చెక్, 464.2) వరుసగా స్వర్ణం, రజతం నెగ్గారు. క్వాలిఫికేషన్‌లో 589 పాయింట్లతో ఆరో ప్లేస్‌లో నిలిచిన ఇండియన్ షూటర్‌కు ఫైనల్లో లియు యుకున్ (చైనా) నుంచి గట్టి పోటీ ఎదురైంది.
ఎలిమినేషన్‌లో అఖిల్ వరుసగా 10.5, 10.7 పాయింట్లు రాబట్టడంతో థర్డ్ ప్లేస్ ఖాయమైంది. విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో అషి చౌక్సీ (587), నిశ్చల్ (585) వరుసగా 9, 10వ స్థానాల్లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. విమెన్స్ 25 మీటర్ల పిస్టల్‌లో రిథమ్ సంగ్వాన్ బ్రాంజ్ మెడల్ షూటాఫ్‌లో ఫెయిలయ్యాడు. సిమ్రన్‌ప్రీత్ కౌర్ ఆరో ప్లేస్‌తో సరిపెట్టుకుంది.
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్‌లో విజయ్‌వీర్ సిధూ (581), అనీష్ భన్వాల (580) వరుసగా ఏడు, తొమ్మిది ప్లేస్‌ల్లో నిలిచి ఫైనల్స్‌కు దూరమయ్యారు. స్కీట్ షూటర్ గనేమత్ సెకోన్ క్వాలిఫికేషన్‌లో 122 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో నిలిచి ఫైనల్స్‌కు చేరింది. మెన్స్ ట్రాప్‌లో వివియాన్ కపూర్ (120), అనంత్‌జీత్ సింగ్ నరుకా (121), మైరాజ్ అహ్మద్ ఖాన్ (119) మెడల్ రౌండ్‌కు అర్హత సాధించారు.