
దేశ భద్రతకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి అవసరమైన అత్యాధునిక ఆయుధాలను కేంద్ర సమకూరుస్తోంది. ఏకే-203 రైఫిళ్లు, జవాన్లకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కూడా అందించబోతోంది. దీనికి తోడు కొత్త కాంబాట్ యూనిఫామ్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. తాజాగా సైనికులు గాల్లో ఎగిరేందుకు.. ప్రత్యేక పరిస్థితుల్లో ఘటనా స్థలానికి వీలైనంత త్వరగా చేరుకునేందుకు జెట్ ప్యాక్ సూట్స్ తయారు చేయిస్తోంది. బ్రిటిష్ కంపెనీ గ్రావిటీ ఇండస్ట్రీస్ జెట్ ప్యాక్ సూట్స్ను రూపొందించింది.
చైనాతో సరిహద్దులతో సహా సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లు పర్యటించేందుకు వీలుగా బ్రిటిష్ కంపెనీ గ్రావిటీ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన జెట్‌ప్యాక్ సూట్లను భారత ఆర్మీ పరీక్షించింది. ఆగ్రాలోని ఇండియన్ ఆర్మీ ఎయిర్బోర్న్ ట్రైనింగ్ స్కూల్లో జెట్ ప్యాక్ సూట్లను ప్రదర్శించినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఈ వీడియోను ఇండియన్ ఏరోస్పేస్ డిఫెన్స్ న్యూస్ తన అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది.
అన్ని దిశల్లో టేకాఫ్..
జెట్ ప్యాక్ సూట్ను ధరించిన జవాన్లు..సులభంగా రోడ్డు, నీటిలో, పొలాల్లో వివహరించారు. అంతేకాదు భవనాలపై ఎగురుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. జెట్ ప్యాక్ సూట్లో మూడు జెట్ ఇంజన్లను అమర్చారు. ఒకటి వెనుక భాగంలో, రెండు వైపులా రెండిటిని అమర్చారు. మోడ్రన్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో కూడిన సూట్స్ లో .. అన్ని దిశల్లో సేఫ్ టేకాఫ్, ల్యాండింగ్ కోసం అవసరమైన కంట్రోల్స్ ను అందించారు.
జెట్ ప్యాక్ వల్ల ఉపయోగాలేంటి..?
జెట్ ప్యాక్ సూట్ ధరించిన జవాన్లు...కొండ ప్రాంతాల్లో లేదా మూరుమూల ప్రదేశాల్లో ఎవరికైనా అనారోగ్యం తలెత్తితే... వెంటనే వాళ్లకు మెడికల్ సపోర్ట్ ఇచ్చేందుకు అవసరమైన మందులు తెచ్చివ్వొచ్చు. దీనికి తోడు అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు..జెట్ సూట్లను వాడొచ్చు. పొదల మాటున.. అడవుల్లో తలదాచుకొని దాడులు చేసే టెర్రరిస్టులను గాల్లోనే హతం చేయొచ్చు. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి కశ్మీర్‌లోకి వచ్చే డ్రోన్లను.. గాల్లోనే పేల్చేందుకు ఈ జెట్‌ప్యాక్స్ సూట్స్ ఉపయోగపడతాయి. భూమి మీద నుంచి వచ్చే ప్రమాదాలను అన్ని సార్లు పసిగట్టలేకపోవచ్చు. కొన్నిసార్లు... జవాన్ల కళ్లు గప్పి శత్రువులు సరిహద్దులు దాటేస్తారు. అందువల్ల బార్డర్ లో ఏ అలజడి కనిపించినా... వెంటనే ఈ జెట్ సూట్‌తో గాల్లోకి ఎగిరి నిఘా పెట్టే అవకాశం ఉంటుంది.
జెట్ ప్యాక్ సూట్..జెట్ ఇంధనం, డీజిల్, లేదా కిరోసిన్ ద్వారా నడుస్తోంది. దీన్ని ధరించి సైనికులు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు ఎగరవచ్చు. ఎయిర్ ఇన్ లెట్ కాంపాక్ట్ ఫ్లయింగ్ మెషిన్ విధానంతో జవాన్లు ఎగిరేందుకు వీలుగా వ్యవస్థలు ఉన్నాయి. ఈ జెట్ ప్యాక్ సూట్ గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఎగురుతుంది. జెట్ ప్యాక్ సూట్ బరువు 40 కిలోల కంటే తక్కువ. వీటిని 70 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.