- స్పేస్ఎక్స్ రాకెట్
- జీశాట్ 20 ప్రయోగం సక్సెస్
- స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి ఇస్రో శాటిలైట్
- మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు వినియోగం
బెంగళూరు/కేప్ కానవెరాల్: మారుమూల ప్రాంతాల్లోనూ సమర్థమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఉపయోగపడే అధునాతన జీశాట్ 20(జీశాట్ ఎన్2) ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. మంగళవారం ఉదయం అమెరికాలోని కేప్ కానవెరాల్ స్పేస్ స్టేషన్ నుంచి స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 బీ5 రాకెట్ ద్వారా జీశాట్ 20ని అంతరిక్షానికి చేర్చినట్టు ఇస్రో వాణిజ్య విభాగం ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)’ ప్రకటించింది.
ఈ ప్రయోగాన్ని కేప్ కానవెరాల్ లోని కంట్రోల్ సెంటర్ నుంచి ఎన్ఎస్ఐఎల్ చైర్మన్ రాధాకృష్ణన్ దురైరాజ్, బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ మానిటర్ చేశారు. ప్రయోగం తర్వాత దురైరాజ్ ట్విట్టర్ లో స్పందించారు. శాటిలైట్ ప్రయోగం విజయవంతం అయిందని, శాటిలైట్ సోలార్ ప్యానెళ్లు సక్సెస్ ఫుల్ గా విచ్చుకున్నాయని, అన్ని పరికరాలు నార్మల్ గానే పని చేస్తున్నాయని తెలిపారు.
శాటిలైట్ ను బెంగళూరులోని ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సైంటిస్టులు తమ నియంత్రణలోకి తీసుకున్నారని వెల్లడించారు. సోమనాథ్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. 4,700 కిలోల బరువైన జీశాట్ 20ని ఫాల్కన్ 9 రాకెట్ 34 నిమిషాల్లో నిర్దేశించిన కక్ష్యలోకి విజయవంతంగా చేర్చిందన్నారు. కాగా, ఇది ఎన్ఎస్ఐఎల్ ఆధ్వర్యంలో ప్రయోగించిన తొలి కేఏ బ్యాండ్ హై త్రోపుట్ కమ్యూనికేషన్ శాటిలైట్.
దేశంలోని మారుమూల ప్రాంతాలతోపాటు విమానాల్లో సైతం ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. జీశాట్ 20 శాటిలైట్ 14 ఏండ్ల పాటు సేవలు అందించనుంది.
19వ సారి రీయూజ్డ్ రాకెట్ వాడకం..
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ తన ఫాల్కన్ 9 రాకెట్‌ను ప్రయోగించడం ఇది 396వ సారి. ఇప్పటివరకు నాలుగుసార్లు మాత్రమే ఈ రాకెట్ ఫెయిల్ అయింది. తాజా ప్రయోగంలో రాకెట్ ఫస్ట్ స్టేజీ 8 నిమిషాల తర్వాత రెండో స్టేజీ నుంచి విడిపోయి కిందకు వచ్చింది. అట్లాంటిక్ సముద్రంలో ఏర్పాటు చేసిన డ్రోన్ షిప్ వేదికపై సురక్షితంగా దిగింది. ఇలా ఫాల్కన్ 9 రాకెట్ ఫస్ట్ స్టేజీని స్పేస్ఎక్స్ రివకరీ చేయడం ఇది 371వ సారి.
తాజా ప్రయోగంతో కలిపి దీనిని19 సార్లు ఉపయోగించినట్టయింది. కాగా, ఫాల్కన్ 9 బీ5 రాకెట్ 70 మీటర్ల పొడవు, 549 టన్నుల బరువు ఉంటుంది. భూ బదిలీ కక్ష్య వరకూ 8,300 కిలోల బరువును, లో ఎర్త్ ఆర్బిట్ వరకూ 22,800 కిలోల బరువును ఇది మోసుకెళ్లగలదు.