ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ 13 వందల పాయింట్లు.. నిఫ్టీ 400 పాయింట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. 2024, అక్టోబర్ 3వ తేదీ గురువారం.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న పరిస్థితి ఇదీ. సెన్సెన్స్, నిఫ్టీల్లో దాదాపు 90 శాతం షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. మెటల్, స్టీల్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఆయిల్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఇన్ఫ్రా, పెయింట్, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు భారీగా పడిపోయాయి. మిగతా అన్ని షేర్లు భారీగా పడిపోయాయి.
మార్కెట్ ప్రారంభం అయినప్పటి నుంచి నష్టాల్లోనే ఉంది. గంట గంటకు ఆ నష్టాలు పెరుగుతూ మధ్యాహ్నానికి సెన్సెక్స్ 13 వందల పాయింట్లు నష్టపోయింది. ఓవరాల్ గా ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల డబ్బులు ఆవిరి అయ్యాయి.
స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణాలు లేకపోలేదు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ప్రధానంగా ఎఫెక్ట్ పడింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుండటంతో.. అంతర్జాతీయంగానూ అన్ని స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అదే మన స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపింది. దీనికితోడు అమెరికాలో ఎన్నికల ఇంపాక్ట్ కూడా చూపించింది. కొన్ని దేశాల్లో రాజకీయ అనిశ్చితి సైతం మార్కెట్లు పడిపోవటానికి కారణంగా చెబుతున్నారు ఆర్థిక విశ్లేషకులు.
ఇజ్రాయెల్ తో ఇరాన్ యుద్ధానికి దిగటంతో.. ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని.. ధరలు పెరుగుతాయనే భయం మార్కెట్ వర్గాలను భయాందోళనకు గురి చేశాయి. మరో వైపు చైనా ఆర్థిక వ్యవస్థ సైతం గందరగోళంలో ఉంది. కొన్ని సంవత్సరాలతో పోల్చితే.. ఈసారి చైనా కంపెనీల పనితీరు బాగా తగ్గింది.. ఈ క్రమంలోనే కంపెనీల మనుగడ కోసం చైనా కొత్త ప్యాకేజీ ప్రకటించింది. ఈ పరిణామాలు కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనకు గురి చేస్తుంది. చైనా కంపెనీల పనితీరు.. ఆయా కంపెనీ ఆర్థిక లావాదేవీలపై అనేక సందేహాలతో పెట్టుబడులను భారీ ఎత్తున ఉపసంహరించుకుంటున్నారు. దీంతో మార్కెట్ పతనం కావటానికి కారణం అంటున్నారు ఆర్థిక నిపుణులు.