కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి..!

భారత స్టాక్ మార్కెట్ సోమవారం (జనవరి 27) కుప్పకూలింది. వారం తొలి రోజే బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలు నమోదు చేశాయి. బలహీనమైన ప్రపంచ సంకేతాలు, యూఎస్ వాణిజ్య విధానం చుట్టూ నెలకొన్న అనిశ్చితి, విదేశీ నిధుల ప్రవాహం ప్రతికూల సెంటిమెంట్‌ కారణంగా మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 906.97 పాయింట్లు (1.19 శాతం) పతనమై 75,283.49 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 305.3 పాయింట్లు (1.3 శాతం) క్షీణించి 22,786.90 వద్ద మార్కెట్ ముగిసింది.

ALSO READ | హిండ్‌‌‌‌‌‌‌‌వేర్ కొత్త సీఈఓగా నిరుపమ్ సహాయ్‌‌‌‌‌‌‌‌

సోమవారం బెంచ్ మార్క్ సూచీలు కుప్పకూలడంతో ఒక్కరోజే ఇన్వెస్టర్ల రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సోమవారం మార్కెట్ ప్రారంభం నుంచే నష్టాల్లోకి జారుకుంది. ఓ మార్నింగ్ సెషన్లో కాస్తా పుంజుకున్నప్పటికీ తిరిగి సూచీలు  నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను నమోదు చేశాయి. జోమాటో , హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ , పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కంపెనీలు నష్టాలు చవిచూశాయి.

యూఎస్ ట్రేడ్ పాలసీ చుట్టూ నెలకొన్న అనిశ్చితి, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రకటన, డాలర్‎తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, ఫారెన్ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల అమ్మకాలకు మొగ్గుచూపడం, భారత్‌ దిగ్గజ కంపెనీల క్యూ3 ఫలితాల అంచనాలను అందుకోకపోవడం వంటి ప్రధాన కారణాల వల్ల సోమవారం (జనవరి 27) భారత్ బెంచ్ మార్క్ సూచీలపై బేర్ పంజా విసిరింది. 

81 వేల పాయింట్ల జీవిత కాల గరిష్టాలను తాకిన సెన్సెక్స్.. రోజుల వ్యవధిలోనే 75,283 పాయింట్లకు పడిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అలాగే.. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‎ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులను చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పరిణామాల వల్ల గత కొద్ది రోజులుగా భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనై నష్టాలను చవిచూస్తోంది.