షాక్​ మార్కెట్​: ఇన్వెస్టర్లు విలవిల.. ఆరు నెలల్లో 75 లక్షల కోట్లు హాంఫట్

షాక్​ మార్కెట్​: ఇన్వెస్టర్లు విలవిల.. ఆరు నెలల్లో 75 లక్షల కోట్లు హాంఫట్
  • స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ స్టాక్స్​ ఢమాల్​
  • 35 నుంచి 70 శాతం దాకా షేర్లు డౌన్
  • కరోనా తర్వాత ర్యాలీని చూసి మార్కెట్​లోకి మిడిల్​ క్లాస్​ పబ్లిక్​
  • తక్కువ టైమ్​లో ఎక్కువ లాభాలొస్తాయని స్మాల్​ క్యాప్స్​లోకి ఎంట్రీ
  • 2020లో డీమాట్​ అకౌంట్ల సంఖ్య 4 కోట్లు.. ఇప్పుడు 22  కోట్లు 
  • తెలంగాణ నుంచే సుమారు 48 లక్షల  ఖాతాలు
  • నిరుడు సెప్టెంబర్​ లాస్ట్ వీక్​ నుంచి వరుసగా మార్కెట్​ పతనం
  • అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ బాధ్యతలు చేపట్టాక మరింత కిందికి
  • టారిఫ్​ వార్​, ఎఫ్​ఐఐల సేల్స్​తో ఆగమాగం 
  • కేంద్ర ప్రభుత్వం చర్యలు కంటితుడుపే

స్టాక్​ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఆదాయం మాట అటు ఉంచి.. పెట్టిన పెట్టుబడిలో సగానికిపైగా నష్టాలు చూపిస్తున్నాయి. ఏం చేయాలో పాలుపోక ఇన్వెస్టర్లు, ముఖ్యంగా మిడిల్​ క్లాస్​ పబ్లిక్​ తలలు పట్టుకుంటున్నారు. 

ఇవాళ కాకుంటే రేపు.. రేపు కాకుంటే ఎల్లుండి.. మన పెట్టుబడి మనకు రాదా అన్న ఆశతో ఎదురుచూస్తున్నవారికి ప్రతిరోజూ ‘రెడ్’​ సిగ్నల్​ పడుతూనే ఉంది. కరోనా టైమ్​లో కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు.. ఇప్పుడూ అదే స్థాయిలో పడిపోతున్నాయి. కొన్ని షేర్లయితే 70 శాతం దాకా పడిపోయాయి. 

ఆరు నెలల కిందటి వరకు ఫర్వాలేదనిపించిన మార్కెట్లు.. అనంతరం పడిపోవడం షురూ జేశాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ బాధ్యతలు చేపట్టాక అది పీక్స్​కు చేరింది. ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఏకంగా ఆరునెలల్లో సుమారు రూ.75 లక్షల కోట్లు మటాష్​ అయ్యాయి.

బిజినెస్‌ డెస్క్‌, వెలుగు : గత ఆరునెలల నుంచి మన స్టాక్ మార్కెట్లు వరుసగా పతనమవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టేస్తున్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెడితే.. ఆరు నెలలకన్నా, ఏడాదికన్నా మంచి లాభాలు వస్తాయని మార్కెట్లలోకి దిగుతున్న జనం తెల్లముఖం వేస్తున్నారు. తక్కువ టైమ్​లో ఎక్కువ లాభాలు ఇచ్చే స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఇరవై రోజుల నుంచైతే ఈ ఇండెక్స్​లలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 

పెద్ద ఇన్వెస్టర్ల నుంచి చిన్న ఇన్వెస్టర్ల వరకు అందరి పోర్ట్​ఫోలియోలు 35 నుంచి 70 శాతం వరకు మైనస్​లో ట్రేడ్​ అవుతున్నాయి. అంటే పెట్టుబడిలో దాదాపు సగం వరకు నష్టాలే చూపెడ్తున్నాయి. ఎట్ల గట్టెక్కాలో తెలియక కొందరు లాస్​లోనే బయటకు వచ్చేస్తున్నారు. ఇంకొందరు అప్పు చేసి మరీ.. ఉన్న స్టాక్స్​కు ఇంకిన్ని యాడ్​ చేస్తూ పోతున్నారు. యాడ్​ చేసినా కొద్దీ.. ఇంకా పడిపోతూనే ఉన్నాయి కానీ పెరగడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. 

మార్కెట్​ పతనాన్ని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క చర్య కూడా ఫలితం ఇవ్వడం లేదు. అవి కంటి తుడుపు చర్యలుగానే మిగిలిపోతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ల నుంచి వెళ్లిపోతుండటం, మన రూపాయి విలువ రోజురోజుకు పడిపోతుండటం, ట్రంప్​ విధిస్తున్న టారిఫ్​లు మార్కెట్లను ఆగంపట్టిస్తున్నాయి.

కరోనా కంటే ముందు స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల ఆలోచన మిడిల్​ క్లాస్​ పబ్లిక్​కు పెద్దగా ఉండేది కాదు. ఆ వైపు అసలు తొంగిచూసేవారే కాదు. కరోనా ఎఫెక్ట్​తో 2020లోస్టాక్​ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఆ సంక్షోభం ముగిసి పరిస్థితులు గాడిలో పడుతున్న కొద్దీ.. స్టాక్​ మార్కెట్​లవైపు మధ్యతరగతి ప్రజలు రావడం మొదలుపెట్టారు. లాక్​ డౌన్​ వల్ల ఇంటికే పరిమితమవడంతో.. సోషల్ మీడియాలోనో, ఫ్రెండ్స్​ చెప్తేనో స్టాక్​ మార్కెట్ల గురించి తెలుసుకొని డీ మాట్​ అకౌంట్లు ఓపెన్​ చేశారు. అట్ల స్టాక్స్​లోకి వచ్చి పెట్టుబడులు స్టార్ట్​ చేశారు. ముఖ్యంగా యువత  పెద్ద మొత్తంలో డీమాట్ అకౌంట్లు ఓపెన్ చేశారు.  2020 లో 4 కోట్లుగా ఉన్న డీమాట్ అకౌంట్లు,  ఈ నెల 17 నాటికి సుమారు 22  కోట్లకు చేరుకున్నాయి. 

సెప్టెంబర్​లో పీక్​ హైలోకి చేరి..!

కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత బుల్‌‌ మార్కెట్ కొనసాగడంతో ఇన్వెస్టర్లు కొన్న మెజార్టీ షేర్లు లాభాలనే ఇచ్చాయి. ఏడాదిన్నర కిందట 20 వేల దగ్గర ట్రేడ్​ అయిన ‘నిఫ్టీ 50’ ఇండెక్స్​ నిరుడు సెప్టెంబర్​ మొదటి వారంలో 26వేల మార్క్​ను చేరుకుంది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. వరుసగా పడుతూ వచ్చింది. ముఖ్యంగా స్మాల్‌‌, మిడ్‌‌ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. గత ఆరు నెలల్లోనే ఇన్వెస్టర్లు సుమారు రూ.75 లక్షల కోట్లు నష్టపోయారు. నిరుడు సెప్టెంబర్‌‌‌‌లో బీఎస్‌‌ఈలోని లిస్టెడ్ కంపెనీల  మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.475 లక్షల  కోట్లకు చేరుకోగా, మంగళవారం నాటికి ఈ నెంబర్  రూ.398 లక్షల కోట్లకు పడిపోయింది. చాలా షేర్లు 50 శాతానికి పైగా  క్రాష్ అయ్యాయి.

 నిఫ్టీ స్మాల్‌‌ క్యాప్ 100  ఇండెక్స్ నిరుడు సెప్టెంబర్‌‌‌‌లో పీక్ లెవెల్‌‌కు చేరుకోగా.. ప్రస్తుతం ఆ లెవెల్‌‌ నుంచి 22 శాతం తక్కువకు ట్రేడవుతున్నది. గత రెండున్నర నెలల్లోనే 18 శాతం పడింది. నిఫ్టీ మిడ్‌‌క్యాప్ ఇండెక్స్  సెప్టెంబర్‌‌‌‌లోని పీక్ లెవెల్‌‌ నుంచి 24 శాతం పడింది. ఎక్కువ లాభాలు పొందొచ్చనే ఉద్దేశంతో స్మాల్‌‌, మిడ్‌‌ క్యాప్‌‌ షేర్లలో రిటైల్‌‌ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. 

2023 లో ఈ షేర్లు ఇన్వెస్టర్లకు పెద్ద మొత్తంలో లాభాలిచ్చాయి. నిఫ్టీ మిడ్‌‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌‌లు 110 శాతానికి పైగా కూడా  పెరిగాయి. కానీ, వాల్యుయేషన్స్‌‌కు తగ్గ బిజినెస్‌‌ లేకపోతే షేర్ల ధరలు అదే స్థాయిలో కొనసాగలేవు. గత ఆరు నెలల నుంచి అదే కనిపిస్తున్నది. స్మాల్‌‌, మిడ్‌‌ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌‌ కూడా ఇన్వెస్టర్లకు నష్టాలే మిగులుస్తున్నాయి. స్మాల్‌‌ క్యాప్ స్కీమ్స్‌‌లోకి వచ్చిన ఇన్వెస్ట్‌‌మెంట్లు గత ఐదేండ్లలో రూ.3.3 లక్షల కోట్లకు పెరగగా.. మిడ్‌‌క్యాప్ స్కిమ్స్‌‌లోకి వచ్చిన ఫండ్స్ రూ.4 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ స్కీమ్స్‌‌ సగటున 14 శాతం లాస్‌‌తో ప్రస్తుతం ట్రేడవుతున్నాయి. 

ట్రంప్​తో మోదీ భేటీ ఫలితం ఉత్తదేనా?

వరుసగా మన స్టాక్​ మార్కెట్లు పడిపోతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో మన ప్రధాని మోదీ భేటీ అవుతారని వార్త రావడంతో ఇన్వెస్టర్లలో ఆశలు చిగురించాయి. అన్నట్టుగానే ఈ నెల 13, 14 తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటించారు. 14న ట్రంప్​తో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందాలు, వారి ప్రెస్​ కాన్ఫరెన్స్​తో మన మార్కెట్లు మళ్లీ నేలముఖం వేశాయి. ‘మీరెంత టారిఫ్​ విధిస్తే.. మేమంత టారిఫ్​ విధిస్తాం’ అని మోదీ ముందటే ట్రంప్​ కుండబద్ధలు కొట్టడంతో టారిఫ్​ వార్​ ఆగేటట్టు లేదని ఇన్వెస్టర్లలో అభిప్రాయం బలంగా నాటుకుంది. అలా ఇప్పటికీ నష్టాల్లోనే మార్కెట్లు కొనసాగుతున్నాయి.

అక్టోబర్​లో ఎఫ్​ఐఐల సేల్స్​ పీక్స్​కు​ 

నిరుడు ఆగస్టు నుంచి వరుసగా ఫారెన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్స్​ (ఎఫ్​ఐఐ)  మన మార్కెట్ల నుంచి వెళ్లిపోతున్నారు. ప్రతి నెలా వారు అమ్మకాల్లోనే కొనసాగుతున్నారు.  డొమెస్టిక్స్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్స్​ (డీఐఐ) అందుకు కౌంటర్​గా ఎంత కొంటున్నా ఫాయిదా ఉండటం లేదు. 

నిరుడు ఆగస్టులో రూ. 20,339 కోట్లు, సెప్టెంబర్​లో రూ. 12,611 కోట్లు ఎఫ్​ఐఐలు సేల్​ చేశారు. అత్యధికంగా అక్టోబర్​లో రూ. 1,14,445 కోట్లు సేల్​ చేశారు. నవంబర్​లో రూ. -45,974 కోట్లు, డిసెంబర్​లో రూ.  -16,982 కోట్లు, జనవరిలో  రూ. 87,374 కోట్ల మాల్​ను అమ్మేశారు. చాలా రోజుల తర్వాత మంగళవారం  రూ. 4,700 కోట్లు కొనుగోలు చేసి.. మన రిటైల్​ ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించిన ఎఫ్​ఐఐలు.. బుధవారం తుస్సుమనిపించారు. బుధవారం  మళ్లీ రూ.-1,881 కోట్లు అమ్మేశారు. దీని ప్రభావం స్టాక్​ మార్కెట్ల పతనానికి కారణమవుతున్నది. 

షేర్లు అమ్మేసుకుంటున్న ఫారిన్​ ఇన్వెస్టర్లు

నిరుడు ఆగస్టు నుంచి వరుసగా ఫారెన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్స్​ (ఎఫ్​ఐఐ)  మన మార్కెట్ల నుంచి వెళ్లిపోతున్నారు. ప్రతి నెలా వారు అమ్మకాల్లోనే కొనసాగుతున్నారు.  ఆరు నెలల్లోనే రూ. 2.97 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. నిరుడు ఆగస్టులో రూ. 20,339 కోట్లు, సెప్టెంబర్​లో రూ. 12,611 కోట్లు ఎఫ్​ఐఐలు సేల్​ చేశారు. అత్యధికంగా అక్టోబర్​లో రూ. 1,14,445 కోట్లు అమ్ముకున్నారు.

నవంబర్​లో రూ. -45,974 కోట్లు, డిసెంబర్​లో రూ.  -16,982 కోట్లు, జనవరిలో  రూ. 87,374 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. చాలా రోజుల తర్వాత మంగళవారం రూ. 4,700 కోట్లు కొనుగోలు చేసి.. మన రిటైల్​ ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించిన ఎఫ్​ఐఐలు.. బుధవారం తుస్సుమనిపించారు. బుధవారం  మళ్లీ రూ.-1,881 కోట్లు అమ్మేశారు. ఈ ప్రభావంతో స్టాక్​ మార్కెట్లు కుదేలవుతున్నాయి.

అందరిదీ ఇదే కథ 

హైదరాబాద్​కు చెందిన రాజ్​ అనే యువకుడు ఏడాది కింద స్టాక్​ మార్కెట్​లో  రూ. 3 లక్షలు  పెట్టుబడి పెట్టిండు. స్మాల్​ క్యాప్ నుంచి​ కొన్ని, మిడ్​ క్యాప్​ నుంచి కొన్ని, లార్జ్​ క్యాప్స్​ నుంచి మరికొన్ని షేర్లు కొనుగోలు చేసిండు. ఆరు నెలల కింద రాజ్​ పోర్ట్​ఫోలియో రూ. 4 లక్షల వరకు చూపెట్టింది. అంటే రూ. లక్ష లాభాలన్నమాట. కానీ, ఇప్పుడు ఆ పోర్ట్​ ఫోలియోలో లక్ష రూపాయల లాభం హుష్​కాకి అయింది. పెట్టుబడిలోనూ రూ. 50వేలు మైనస్​ చూపెడ్తున్నది. 

నల్గొండకు చెందిన ప్రణత్​.. నాలుగేండ్ల కింద రూ. 5 లక్షలు ఇన్వెస్ట్​ చేసిండు. ఆరునెలల కిందటి వరకు రూ. 2 లక్షల వరకు లాభాల్లో ఉన్న అతడి పోర్ట్​ఫోలియో ఇప్పుడు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నది. పెట్టుబడిలోనే 20 శాతం మైనస్​లోకి జారుకుంది. మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ స్టాక్స్​ ఎక్కువగా నష్టాల్లోకి పోయాయని, లార్జ్​ క్యాప్స్​లో పెద్దగా తేడా లేదని ప్రణత్​ చెప్పిండు.

రూపాయి ఢమాల్​

అమెరికా డాలర్ రోజు రోజుకూ బలపడుతుండగా.. మన రూపాయి విలువ అంతే వేగంగా పడిపోతున్నది. నిరుడు సెప్టెంబర్​లో రూపాయి విలువ 84 వద్ద ఉండగా..  డిసెంబర్​లో  85.80 స్థాయికి పడింది. ఈ నెలలోనైతే  88 మార్క్​ను టచ్​ చేసింది. బుధవారం 86.86 వద్ద ముగిసింది. అంటే గత ఆరు నెలల కాలంలో రూపాయి విలువ సుమారు రూ.4  దాకా తగ్గింది. రూపాయి విలువ పడిపోవడం అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నది. 

కరీంనగర్​కు చెందిన రమేశ్..  ఓ చిరువ్యాపారి. ఎవరో మిత్రులు చెప్తే ఆరేండ్ల నుంచి స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​ చేయడం మొదలుపెట్టాడు. ఆరేండ్ల నుంచి నిరుడు జనవరి వరకు పెట్టుబడులు పెడుతూ పోయాడు. అట్ల రూ. 10 లక్షల దాకా ఇన్వెస్ట్​ చేశాడు. ఏడాది కిందటి వరకు అతడికి రూ. 4 లక్షల వరకు లాభాలు కనిపించాయి. ఆరునెలల కింద ఆ లాభాలు పోయి.. నష్టాల్లోకి పోర్ట్​ఫోలియాలో మళ్లింది. వరుసగా నష్టాలు వస్తుండటంతో తట్టుకోలేక.. సగం స్టాక్స్​ను నష్టాల్లోనే తీసేశాడు. అట్ల 2 లక్షల రూపాయల వరకు నష్టపోయానని, ఇప్పుడున్న స్టాక్స్​లో కూడా సగం వరకు నష్టాల్లోనే నడుస్తున్నాయని రమేశ్​ వాపోయాడు. 


ఐదేండ్లలో తెలంగాణలో 37 లక్షల కొత్త అకౌంట్లు

తెలుగు రాష్ట్రాల నుంచి స్టాక్ మార్కెట్‌‌ ఇన్వెస్టర్లు  భారీగా పెరిగారు.  ఎన్‌‌ఎస్‌‌ఈ డేటా ప్రకారం.. తెలంగాణ నుంచి సుమారు 48 లక్షల డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇందులో గత ఐదేండ్లలోనే  37 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి 97 లక్షల డీమాట్ అకౌంట్లు ఓపెన్ కాగా, గత ఐదేండ్లలోనే  69 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌‌పై బాగానే ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్  (ఎఫ్‌‌ అండ్ ఓ) వంటి క్లిష్టమైన సెగ్మెంట్‌‌లో ట్రేడింగ్ చేస్తున్న వారు పెరుగుతున్నారు.

అలానే పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు కూడా. సెబీ డేటా ప్రకారం, కిందటేడాది సెప్టెంబర్ 29 నాటికి ఎఫ్‌‌ అండ్ ఓ ట్రేడింగ్‌‌లో ఎక్కువ నష్టపోయిన వారిలో  మనవారే ముందున్నారు. తెలంగాణ ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు 2023–24 లో సగటున రూ.1.97 లక్షలు నష్టపోగా,  ఆంధ్రప్రదేశ్‌‌ ట్రేడర్లు సగటున రూ.1.45 లక్షలు లాస్ అయ్యారు. ఇంకా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసి నష్టపోయిన వారిలో దక్షిణాది రాష్ట్రాల ట్రేడర్లే ఎక్కువగా ఉన్నారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడర్ల సంఖ్యను బట్టి  తెలంగాణ 12వ ప్లేస్‌‌లో, ఆంధ్రప్రదేశ్‌‌  13 వ ప్లేస్‌‌లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 2.1 లక్షల మంది ఈ సెగ్మెంట్‌‌లో ట్రేడ్​ చేస్తున్నారు.  

కేంద్రం చర్యలు కంటితుడుపే!

నిరుడు బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​ (ఎల్​టీసీజీ), సెక్యూరిటీస్​ఈ ట్రాన్షాక్షన్​ ట్యాక్స్​ (ఎస్​టీటీ) భారీగా పెంచడంతో ఇన్వెస్టర్లలో భయం మొదలైంది. ఆ తర్వాత నుంచి ఎఫ్​ఐఐలు అమ్మకాలు షురూ జేశారు. ఆ ప్రభావం సెప్టెంబర్, అక్టోబర్​ నుంచి భారీగా కనిపిస్తున్నది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. మొన్న బడ్జెట్​లో ఎల్​టీసీజీ, ఎస్​టీటీ ఊసెత్తలేదు. వాటి గురించి కేంద్రం మాట్లాడకపోవడంతో కొంతలో కొంతైనా మార్కెట్లు పెరుగుతాయని ఇన్వెస్టర్లు అంచనా వేశారు.

 కానీ, ఫలితం కనిపించలేదు. మొన్న బడ్జెట్​లో మిడిల్​ క్లాస్​ పబ్లిక్​కు ఊతమిచ్చేలా రూ. 12 లక్షల వరకు నో ఇన్​కమ్​ ట్యాక్స్​ అని కేంద్రం ప్రకటించింది. దానికి తోడు ఆర్​బీఐ దాదాపు ఐదేండ్ల తర్వాత రెపో రేట్లను 25 బేసిస్​ పాయింట్స్​ కట్​ చేసింది.. తాజాగా బ్యాంకింగ్​ రంగంలోకి రూ. 40 వేల కోట్లు ఇంజెక్ట్  చేసేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.. ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా స్టాక్​ మార్కెట్ల పతనాన్ని ఆపడం లేదు. కేంద్రం చర్యలు కంటి తుడుపుగానే ఉంటున్నాయని బడా ఇన్వెస్టర్లు అంటున్నారు.  

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ప్రస్తుతం పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్​ఫోలియోలు కూడా భారీ నష్టాల్లోనే ట్రేడ్​ అవుతున్నాయి. సహజంగానే మన పోర్ట్​ఫోలియోలు కూడా నష్టాల్లోనే ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మిడ్​ క్యాప్​, స్మాల్​క్యాప్​ స్టాక్స్తీ

సుకున్నవారిలో భారీగా లాస్​ కనిపిస్తుండొచ్చని, అయితే.. దీనికి భయపడొద్దని సూచిస్తున్నారు. 

స్టాక్స్​ కొనేటప్పుడే లాంగ్​ టర్మ్​ హోల్డ్​ చేస్తామన్న ఆలోచనతోనే దిగాలి.  స్టాక్స్​కు సంబంధించిన కంపెనీల పూర్వాపరాలు పరిశీలించి, లాభనష్టాలు అంచనా వేసుకొని, చార్ట్​లు విశ్లేషించుకొని  పెట్టుబడులు పెట్టాలి.

ప్రస్తుతం నష్టాల్లో పోర్ట్​ఫోలియోలు ట్రేడ్​ అవుతున్నందున ముందుగా మన ఎమోషన్స్​ను కంట్రోల్​ చేసుకోవాలి. 

పడుతున్నప్పుడు పదే పదే స్టాక్స్​ను యాడ్ చేయొద్దు.. అందుకోసం బయట నుంచి అప్పులు తేవొద్దు. 

మనం కొన్న స్టాక్​ సపోర్ట్​ లెవల్​, రెసిస్టెంట్​ లెవల్​ను జాగ్రత్తగా గుర్తించి ఆ ఏరియాలోనే యాడ్​ చేసుకుంటూ పోవాలి.  

మైనస్​లో పోర్ట్​ఫోలియో ట్రేడ్​ అవుతుందని చెప్పి వాటి నుంచి వెంటనే ఎగ్జిట్​ కావొద్దు.

స్టాక్​ మార్కెట్లలో ఒడిదొడుకులు సహజమని, ఇప్పుడు పడుతున్న స్టాక్స్​ కొన్నాళ్లకు లేస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఓపిక అవసరమని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.   

ఎందుకు కుప్పకూలుతున్నయ్?

‘అమెరికా తుమ్మితే.. ఇండియాకు సర్దయితది’.. మన స్టాక్​ మార్కెట్లలో తరచూ వినిపించే ఊత పదం ఇది. మన మార్కెట్లు వరుసగా కుప్పకూలడానికి అమెరికా అనుసరిస్తున్న విధానాలు ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ గెలిస్తే  మన స్టాక్​ మార్కెట్లకు పండుగే అని నిరుడు చాలా మంది మిడిల్​ క్లాస్​ పబ్లిక్​ పెట్టుబడులు పెట్టారు. నవంబర్​ మొదటి వారంలో ట్రంప్​ గెలిచారని తెలియగానే.. వరుసగా అమెరికా మార్కెట్లు పెరుగుతూ పోయాయి. రికార్డులు సృష్టించాయి. అదే రీతిలో మన మార్కెట్లు  పెరుగుతాయనుకుంటే.. రివర్స్​ అయ్యాయి. 

అంతకు ముందు సెప్టెంబర్​ నుంచే ప్రారంభమైన మన మార్కెట్ల పతనం ట్రంప్​ గెలుపుతో మరింత పతనమయ్యాయి. గత నెల  20న అధ్యక్షుడిగా ట్రంప్​ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్​ వార్​ మొదలు పెట్టడంతో అప్పటి నుంచి బుధవారం కూడా దాదాపు ప్రతిరోజూ నెగెటివ్​లోనే స్టాక్​ మార్కెట్​ ఇండెక్స్​లు క్లోజ్​ అవుతున్నాయి. 

మన మార్కెట్లను ఎక్కువగా నడిపేది ఫారెన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్స్​ (ఎఫ్​ఐఐ).. ఆ తర్వాత స్థానంలో డొమెస్టిక్స్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్స్​ (డీఐఐ) ఉంటారు. ఆగస్టు నుంచి వరుసగా ఎఫ్​ఐఐలు మన మార్కెట్లను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ప్రతి నెలా వేల కోట్లలో సేల్​ చేస్తున్నారు. నిరుడు అక్టోబర్​లో అయితే లక్ష కోట్లకుపైగా సేల్​ చేశారు. ఎఫ్​ఐఐలు మన దగ్గరి నుంచి వెళ్లిపోవడంతోనూ స్టాక్​ మార్కెట్లు నేలచూపుచూస్తున్నాయి.
ఒకప్పుడు ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొందని వార్తలు వస్తే చాలు మన మార్కెట్లు పడిపోయేవి. ఇప్పుడు ఆ యుద్ధవాతావరణం కన్నా.. అమెరికా టారిఫ్​ దెబ్బతోనే భారీగా పడిపోతున్నాయి. 

భారీగా నష్టపోయిన షేర్లు. (ధరలు రూ.లలో)

కంపెనీ    ప్రస్తుత ధర    ఏడాది గరిష్టం    నష్టం(% ల్లో)
స్టెర్లింగ్&విల్సన్‌‌ రెన్యూవబుల్‌‌    254    828      70
వర్ల్‌‌పూల్‌‌ ఆఫ్ ఇండియా            980    2,450      60
మామాఎర్త్‌‌ (హోనాసా)             221      547         60
నెట్‌‌వర్క్                                  18          43         121    65
డేటా ప్యాటర్న్స్‌‌                       1,416    3,655      62
చెన్నై పెట్రోలియం                480        1,275      63
జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌             98         205          53
వొడాఫోన్ ఐడియా                   8          19             58
కిర్లోస్కర్ ఆయిల్‌‌                    620       1,450        58
అదానీ గ్రీన్ ఎనర్జీ                  894       2,174        59
తాన్లా ప్లాట్‌‌ఫామ్స్‌‌                  481      1,086         56