వార్ ఎఫెక్ట్ : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తోడు క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగియడం, యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా దలాల్ స్ట్రీట్ మరోసారి భారీగా నష్టాలను చవి చూసింది. గంటల వ్యవధిలోనే రూ. 10లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. 

మార్కెట్ ప్రారంభానికి ముందే రష్యా సైనిక చర్యకు సంబంధించిన వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధమయ్యారు. ఫలితంగా ఆరంభం నుంచే దేశీయ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. 2వేల పాయింట్ల లాస్తో 55,418.45 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో 55,996.09పాయింట్లు ఇవాళ్టి గరిష్ఠస్థాయి. ఆ తర్వాత ఏ దశలోనూ మార్కెట్ కోలుకోలేదు. అమ్మకాల ఒత్తిడితో 54,383.20 పాయింట్ల కనిష్ఠానికి పతమైన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 2702.15 పాయింట్ల నష్టంతో 54,529.91 వద్ద క్లోజయింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 7శాతానికిపైగా లాసయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, టాటా స్టీల్, విప్రో వాటాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవి చూసింది. 815.30 పాయింట్ల లాస్తో 16247.95 వద్ద క్లోజయింది.