భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక నుంచి మార్కెట్లు ఎలా ఉండనున్నాయి..?

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక నుంచి మార్కెట్లు ఎలా ఉండనున్నాయి..?

ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మంగళవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా (1.14%) పెరిగి 78,296 కు చేరుకుంది. అదే విధంగా నిఫ్టీ50 ఒకానొక పాయింట్ లో 340 పాయింట్లు పైగా (1.48) లాభపడి 23,700 స్థాయిని దాటింది. దీంతో మెజారిటీ కంపెనీలు లాభాల్లో కొనసాగాయి. 

బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ.3.4 లక్షల కోట్లు పెరిగి రూ.423.70 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కు చేరుకుంది. పీఎస్ యూ (ప్రభుత్వ రంగ) బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరగడంతో బ్యాంక్ నిఫ్టీ కూడా లాభాల బాట పట్టింది. 

L&T, టాటా మోటార్స్, అదాని పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇందస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్.
జొమాటో, టైటాన్ కంపెనీ, నెస్ట్లే ఇండియా, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్.

మార్కెట్ పెరుగుదలకు కారణం:

యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ టారిఫ్ వార్ కు కాస్త బ్రేక్ ఇవ్వడంతో మార్కెట్లో ఫుల్ జోష్ వచ్చింది. కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్  ప్రకటించడంతో ట్రేడ్ వార్ మొదలైందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లు కూడా దారుణంగా పడిపోయాయి. అయితే తాజాగా ట్రేడ్ వార్ ను 30 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్యంలో తాత్కాలిక ఉపశమనం కలిగినట్లైంది. దీంతో మార్కెట్లు భారీ లాభాల బాటలో నడుస్తున్నాయి. 

ఇక నుంచి మార్కెట్లు ఎలా ఉండనున్నాయి:

ట్రంప్ టారిఫ్ ల నిర్ణయాన్ని వాయిదా వేయడం.. యూఎస్ డాలర్ దిగి రావడం ఇండియన్ మార్కెట్స్ కు మంచి పరిణామం. గత కొంత కాలంగా డాలర్ ఇండెక్స్ వరుసగా పెరుగుతుండటం.. రూపాయి విలువ తగ్గుదలతో ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ నుంచి భారీగా అమ్మకాలు జరిపి యూఎస్ లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. తాజాగా డాలర్ తగ్గడంతో బాండ్ ఈల్డ్స్ తగ్గనున్నట్లు భావించి ఇండియన్ మార్కెట్స్ లో కొనుగోళ్ల మద్ధతు పెరిగింది. 

మరోవైపు ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ అమెరికా పర్యటించనున్న క్రమంలో.. ఇండియాపై యూఎస్ టారిఫ్ విధించే అవకాశం లేదనే ఆశావాదం నెలకొంది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగి వస్తుండటాన్ని మార్కెట్లు పాజిటివ్ గా తీసుకున్నాయి. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ మిడిల్ క్లాస్ అనుకూల బడ్జెట్ అనే ప్రచారంతో.. ఇండియా కన్జంప్షన్ పెరుగుతుందని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. ఈ అంశాలతో ఇవాళ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.