Bull Markets: మార్కెట్ల శుభారంభం.. ట్రంప్ నిర్ణయంతో బుల్స్‌లో ఊపిరి.. TCS ఢమాల్..

Bull Markets: మార్కెట్ల శుభారంభం.. ట్రంప్ నిర్ణయంతో బుల్స్‌లో ఊపిరి.. TCS ఢమాల్..

Markets Bull Rally: నిన్న సెలవు తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు తమ వారాంతపు ట్రేడింగ్ కోసం నేడు ప్రయాణాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు అనేక దేశాలపై సుంకాలను 90 రోజల వరకు నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటనతో అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్న వేళ ఆ సానుకూల సెంటిమెంట్ భారతీయ స్టాక్ మార్కెట్లకూ విస్తరించింది. దీంతో నేడు కీలక బెంచ్ మార్క్ సూచీలతో పాటు ఫార్మా స్టాక్స్ దూసుకుపోతున్నాయి.

ఉదయం 9.42 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1370 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 440 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 730 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 850 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో మార్కెట్లలోని బుల్స్ జోరు తిరిగి స్టార్ట్ అయ్యింది. ఇదే సమయంలో జపాన్స్ నిక్కీ సూచీ 9 శాతం పెరగగా తైవాన్ బెంచ్ మార్క్ సూచీలు 9.3 శాతం మేర లాభంతో ముందుకు సాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ రిలీఫ్ ప్రకటించిన దేశాల్లో ఇండియా కూడా ఉండటమే ప్రస్తుతం మార్కెట్ల మెగా ర్యాలీకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రాథమిక 10 శాతం టారిఫ్స్ మాత్రం కొనసాగుతుందని ట్రంప్ వెల్లడించారు. 

కుప్పకూలిన టీసీఎస్ స్టాక్..
నేడు స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ షేర్ల పతనానికి కారణం నిన్న కంపెనీ ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయటమే. వరుసగా రెండవ ఏడాది కూడా కంపెనీ సింగిల్ డిజిట్ గ్రోత్ నమోదు చేయటమే దీనికి కారణం. ఆటంకాలు ఉన్నప్పటికీ రానున్న ఆర్థిక సంవత్సరం మెరుగైన పనితీరు కనబరచగలమని టీసీఎస్ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మెుత్తం ఆదాయం రూ.2 లక్షల 40 వేల కోట్లకు పైగానే ఉందని ఆయన వెల్లడించారు.  అయితే ట్రంప్ రంగాల వారీగా టారిఫ్స్ ప్రకటిస్తారనే భయాలు భారతీయ ఐటీ సేవల కంపెనీలను ప్రధానంగా వెంటాడుతోందని తెలుస్తోంది. నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.12వేల 224 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో అట్రిషన్ రేటు పెరుగుదల, తక్కువగా పెరిగిన హెడ్ కౌంట్ మార్కెట్లలోని ప్రతికూలతలకు అద్దం పడుతోంది.