అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన పిట్టల వెంకటరమణ ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. మార్చి 9న యమహా పర్సనల్ వాటర్‌క్రాఫ్ట్(జెట్‌స్కీ)ను అద్దెకు తీసుకొని అక్కడి ఫ్లోటింగ్ ప్లే గ్రౌండ్‌లో నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో జెట్‌స్కీ వేగంగా ఢీకొనడంతో వెంకటరమణ తీవ్రంగా గాయాలపాలయ్యాడు.
దాంతో వెంకటరమణను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో డిగ్రీ పూర్తిచేసిన వెంకట రమణ.. ఏడాదిన్నర కిందట అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఇండియానా పోలీస్‌లోని పర్ద్యూ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తికానుండగా ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వెంకటరమణ తండ్రి రాజ గనేశ్ రైల్వే గార్డుగా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వెంకటరమణ పెద్ద కుమారుడు. కూతురుకి పెళ్లి చేసిన రాజ గనేశ్.. పెద్ద కొడుకు వెంకటరమణను ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపారు. కాగా గతేడాది అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.